
NEET : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్ (యూజీ)’ పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. గతంలో చోటుచేసుకున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వచ్చే ఏడాది (2027) నుండి నీట్ పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) మోడ్‌లో నిర్వహించబోతున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రాధాకృష్ణన్ కమిటీ’ సిఫార్సుల ఆధారంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
విద్యార్థులు ఇకపై ఈ ఆన్‌లైన్ విధానానికి అనుగుణంగానే తమ ప్రిపరేషన్‌ను ఇప్పుడే సాగించాలని మంత్రి సూచించారు. పరీక్షల భద్రతను పటిష్టం చేయడంతో పాటు, రాబోయే రోజుల్లో పరీక్షల నిర్వహణను మరింత వికేంద్రీకరణ పద్ధతిలో చేపట్టే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయని, దీనికి కావలసిన సాంకేతిక, లాజిస్టికల్ ఏర్పాట్లను ప్రభుత్వం సమీక్షిస్తోందని ఆయన తెలిపారు.
రాహుల్ గాంధీకి ఆత్మన్యూనతా భావం.. దేశానికి క్షమాపణ చెప్పాలి:
నీట్ వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేస్తున్నారని ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌కు ఆత్మన్యూనతా భావం ఉందంటూ వ్యాఖ్యానించిన మంత్రి, ప్రతిపక్ష నేతగా ప్రశ్నలు అడిగే హక్కు ఉన్నప్పటికీ విద్యార్థులలో అనవసరమైన భయాన్ని, గందరగోళాన్ని సృష్టించడం సరికాదన్నారు. నాగపూర్‌కు చెందిన ఒక విద్యార్థి అబుదాబిని పరీక్షా కేంద్రంగా ఎంచుకున్న ఉదంతాన్ని రాహుల్ గాంధీ తప్పుగా ప్రచారం చేశారని మంత్రి మండిపడ్డారు. సదరు విద్యార్థి స్వయంగా ఆ పోర్టల్‌లో అబుదాబిని ఎంచుకున్నాడని, ఆ తర్వాత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సదరు కుటుంబంతో మాట్లాడి నాగపూర్‌లోనే పరీక్ష రాసే అవకాశం కల్పించినప్పటికీ రాహుల్ గాంధీ దీనిపై పెద్ద పోస్ట్ పెట్టారని విమర్శించారు. రాహుల్ గాంధీకి కొంచెమైనా జవాబుదారీతనం ఉంటే దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు.. తీవ్రవాదుల ‘బి-టీమ్’ హస్తం:
పేపర్ లీకేజీలు, రిక్రూట్‌మెంట్ల ఆలస్యంపై జంతర్ మంతర్ వద్ద నిరంతర నిరసనలు తెలుపుతూ విద్యామంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తున్న ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) వంటి యువజన సంయుక్త సంఘాల ప్రదర్శనలపై మంత్రి ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని చెబుతూనే, ఆందోళనల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను ప్రశ్నించారు.”దేశాన్ని ముక్కలు చేయాలనుకునే (టుక్డే టుక్డే) శక్తులే ఈ రోజు జంతర్ మంతర్ వద్ద డప్పులు వాయిస్తున్నాయి. అక్కడ కనీసం ఒక్క నిజమైన విద్యార్థి అయినా ఉన్నారా? వీరంతా తీవ్రవాదుల ‘బి-టీమ్’ (B-team of extremists) లాంటి వారు” అని ధర్మేంద్ర ప్రధాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విద్యార్థులలో భయాందోళనలు, గందరగోళం సృష్టించాలనే ప్రతిపక్షాల, నిరసనకారుల ప్రయత్నాలు ఫలించలేదని, యువత ప్రభుత్వ వ్యవస్థలను నమ్ముతూ పరీక్షలపైనే దృష్టి పెట్టారని ఆయన అన్నారు.
పేపర్ మాఫియాపై ఉక్కుపాదం:
భవిష్యత్తులో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల పారదర్శకతను కాపాడటానికి సమాజాన్ని, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తామని మంత్రి తెలిపారు. భయాందోళనలు సృష్టించే వారిపై , వ్యవస్థలో చొరబడిన పేపర్ మాఫియాపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. నీట్, యూజీసీ-నెట్ (UGC-NET) వంటి ప్రతిష్టాత్మక పరీక్షలను పూర్తిగా లోపరహితంగా నిర్వహించడమే తమ బాధ్యతని స్పష్టం చేశారు. ఈ పరీక్షల నిర్వహణను ప్రధాని నరేంద్ర మోదీ కూడా నిరంతరం నిశితంగా గమనిస్తూ, తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారని ఈ సందర్భంగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గుర్తుచేశారు.









