Mamata Benarjee : పశ్చిమ బెంగాల్ అధికార పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో మునుపెన్నడూ లేని విధంగా అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ (దీదీ) పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, తిరుగుబాటు వర్గం ఆమెకు ఊహించని షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూ సవాల్ విసురుతోంది. ఈ పరిణామాలు బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం కోల్‌కతా న్యూటౌన్‌లో రెబల్ ఎమ్మెల్యేలు, నేతలంతా భారీ ఎత్తున సమావేశమయ్యారు. దాదాపు 500 మంది జిల్లాల అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు హాజరైన ఈ భేటీలో తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహిస్తున్న రితబ్రత బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. మమతా బెనర్జీని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.అంతేకాకుండా, మమతకు అత్యంత కీలక అనుచరుడిగా, కోల్‌కతా మాజీ మేయర్‌గా ఉన్న ఫర్హాద్ హకీం కూడా తమ గ్రూపులో చేరినట్లు రితబ్రత వెల్లడించారు. ఈ సమావేశంలో తృణమూల్ ఎన్నికల గుర్తును ఉంచినప్పటికీ.. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల చిత్రాలను పూర్తిగా తొలగించడం పార్టీలో మారిన సమీకరణాలకు అద్దం పడుతోంది.
తిరుగుబాటు వర్గం 30 మంది సభ్యులతో కూడిన ప్రత్యామ్నాయ జాతీయ కార్యవర్గాన్ని (వర్కింగ్ కమిటీ) ఏర్పాటు చేసి, తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటించుకుంది. ఛైర్మన్/ఛైర్‌పర్సన్: ఎమ్మెల్యే అరూప్ రాయ్, ఉపాధ్యక్షులు: ఫర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, రథిన్ ఘోష్, సబీనా యాస్మిన్ , ప్రధాన కార్యదర్శులు: రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా రితబ్రత బెనర్జీ మాట్లాడుతూ.. ప్రతినిధుల ఏకగ్రీవ నిర్ణయంతో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నామని, త్వరలోనే జిల్లా కమిటీలను కూడా ప్రకటిస్తామన్నారు. అయితే మమతను పూర్తిగా పక్కనపెట్టే ఉద్దేశం తమకు లేదని, పార్టీకి ఒక మార్గదర్శకురాలిగా లేదా ప్రధాన సలహాదారుగా ఉండాలనుకుంటే ఆమెను స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఈ నూతన కమిటీ నిర్ణయాలను త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని వెల్లడించారు.
ఎదురుదాడికి దిగిన మమతా బెనర్జీ:
తమను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి అసమ్మతి వర్గం తొలగించిన మరుసటి రోజే మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు వేగంగా పావులు కదిపారు. ‘నేషనల్ వర్కింగ్ కమిటీ’ పేరిట ఆమె ఒక కొత్త జాబితాను సిద్ధం చేసి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఈ జాబితాలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (ATMC) ఛైర్‌పర్సన్‌గా మమతనే చేర్చారు. దీని ద్వారా పార్టీపై ఇంకా తనకే పూర్తి అధికారాలు, హక్కులు ఉన్నాయనే గట్టి సంకేతాన్ని ఆమె రాజకీయ వర్గాలకు పంపారు.
ముదురుతున్న సంక్షోభం.. సీనియర్లకు షోకాజ్ నోటీసులు:
ఇటీవలే కోల్‌కతా మేయర్ పదవికి రాజీనామా చేసిన ఫర్హాద్ హకీమ్.. ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితుల్లో తాను సమర్థవంతంగా పనిచేయలేకపోతున్నానని వ్యాఖ్యానించడం గమనార్హం. మమతకు ఒకప్పుడు అత్యంత సన్నిహితులుగా ఉన్న ఫర్హాద్ హకీమ్, అరూప్ బిశ్వాస్ వంటి వారు అసమ్మతి వర్గంలో చేరడంతో పార్టీ తీవ్ర సంక్షోభంలో పడింది.
మరోవైపు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పలువురు సీనియర్ నేతలకు టీఎంసీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో అరూప్ రాయ్, అరూప్ బిశ్వాస్, ఫర్హాద్ హకీమ్, రతిన్ ఘోష్, జావేద్ ఖాన్, సబీనా యాస్మిన్ తదితరులు ఉన్నట్లు సమాచారం. ఇరు వర్గాల పోటాపోటీ నిర్ణయాలు, షోకాజ్ నోటీసుల పర్వంతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.