Hyderabad: సీఐ నాగరాజు అరెస్ట్ ఉదంతంపై ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తీవ్రంగా స్పందించారు. నాగరాజు అరెస్ట్‌ను తాను పూర్తిగా ఖండిస్తున్నానని, ఆయనకు తన పూర్తి మద్దతును తెలియజేస్తున్నానని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, ఎంతటి వారైనా చట్టానికి, న్యాయ వ్యవస్థకు, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు తాము పొందిన ఉన్నత పదవుల వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం, శిక్షణ, త్యాగాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఐపీఎస్, ఐఏఎస్ వంటి సివిల్ సర్వీసెస్ పదవులు కేవలం హోదాలు కావని, ప్రజలకు సేవ చేయడానికి రాజ్యాంగం ఇచ్చిన గొప్ప బాధ్యతలని ఆయన గుర్తుచేశారు.
చట్ట పరిధిలోనే పని చేయాలి:
సీఐ నాగరాజు ఒక సిన్సియర్, అంకితభావం కలిగిన అధికారిగా మంచి పేరు సంపాదించుకున్నారని నట్టి కుమార్ కొనియాడారు. ఒక అధికారి ప్రజల కోసం, విధి నిర్వహణ కోసం పనిచేసేటప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయని, అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రతి ఒక్కరూ చట్ట పరిధిలోనే పని చేయాలని, చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. చట్టం, న్యాయం, రాజ్యాంగ విలువలు అధికారంలో ఉన్నవారికైనా, సాధారణ వ్యక్తులకైనా ఒక్కటేనని ఆయన అన్నారు. అయితే, ఒక సిన్సియర్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న పరిస్థితులను, ఉద్దేశాలను, ఆయన నిజాయితీని కూడా సమాజం సరైన దృష్టితో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా సమాజంలో జరుగుతున్న పరిణామాలపై రాజకీయ నాయకులకు నట్టి కుమార్ కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు, ప్రజల జీవితాలను నాశనం చేసే నేరగాళ్లు, రౌడీ షీటర్ల విషయంలో ప్రభుత్వం, రాజకీయ నాయకుల వైఖరి ఏమిటి? వారిని కఠినంగా శిక్షించాలా? లేక వదిలేయాలా? అనే విషయంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ప్రజలకు, సమాజానికి హాని చేసే వారిపై న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత వ్యవస్థపై ఉందన్నారు. ఈ రోజు నాగరాజుకు ఎదురైన పరిస్థితి కేవలం ఆయన ఒక్కరినే కాకుండా, ఆయన కుటుంబం, పిల్లలు, ఆయన సంపాదించుకున్న గౌరవాన్ని కూడా ప్రభావితం చేస్తుందని, అందుకే పూర్తి నిజాలు బయటకు రావాలని, న్యాయమైన విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
అధికారులకు కీలక సూచన.. నిజం గెలవాలి:
పోలీస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే రాజకీయ నాయకుల మాటలను మాత్రమే నమ్మి నిర్ణయాలు తీసుకోకూడదని నట్టి కుమార్ సూచించారు. “రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ మారుతుంటాయి. కానీ చట్టం, న్యాయం, రాజ్యాంగ విలువలు ఎప్పటికీ నిలిచే శాశ్వత సూత్రాలు. మనకు ఇచ్చిన అధికారాలను చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో ఉపయోగిస్తే ఎవరిముందూ తల వంచాల్సిన అవసరం ఉండదు. మన పని విధానం చూసి మన కుటుంబం గర్వపడేలా ఉండాలి” అని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంలో త్వరలోనే నిజం బయటకు రావాలని, న్యాయమే గెలవాలని నట్టి కుమార్ ఆకాంక్షించారు.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.