rythu bharosa

Rythu Bharosa :  తెలంగాణలో రైతు భరోసా పథకంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతోన్నట్లుగా తెలుస్తోంది. ప్రజల సొమ్ము వృథా కాకుండా, కేవలం నిజమైన రైతులను మాత్రమే ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగుతో సంబంధం లేకుండా, పట్టాదారు పాస్ బుక్ ఉన్న ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందించారు. దీనివల్ల సాగు చేయని బీడు భూములు, కొండలు, గుట్టలు, చివరికి రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు కూడా కోట్ల రూపాయల ప్రజల సొమ్ము పెట్టుబడి సాయం రూపంలో వెళ్ళిపోయింది. ఈ వృథాను అరికట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇకపై నిజంగా పంట సాగు చేసే రైతులకు మాత్రమే ఈ భరోసా సాయాన్ని పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఏడాదికి ఒకే సీజన్ (ఖరీఫ్) కు మాత్రమే సాయాన్ని పరిమితం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ. 15 వేలు ఒకేసారి పంపిణీ చేస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనపై మంత్రివర్గంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇలా ఒకే విడతలో పెద్ద మొత్తాన్ని అందిస్తే రైతులకు పెట్టుబడికి బాగా కలిసివస్తుందని, దీనివల్ల ప్రభుత్వానికి, పార్టీకి తిరుగుండదని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భారీ విజయం సాధించవచ్చని సర్కార్ భావిస్తోంది.

10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న సంపన్న రైతులకు ఈ పెట్టుబడి సాయం అందించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడటం తప్ప ఎలాంటి ఉపయోగం లేదని మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. అందుకే, పెద్ద రైతులను పక్కన పెట్టి.. కేవలం పేద, మధ్యతరగతి రైతులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తే అన్ని రకాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం డిస్కస్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

కౌలు రైతులను ఆదుకునేందుకు

ఈ పథకంలో అత్యంత కీలకమైన మార్పు కౌలు రైతుల గురించినది. నిజంగా భూమిని నమ్ముకుని రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించే కౌలు రైతులకు గతంలో ఎలాంటి సాయం అందలేదు. ఈ వివక్షకు స్వస్తి పలకాలని రేవంత్ సర్కార్ చూస్తోంది. కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని, తద్వారా వారికే నేరుగా భరోసా సాయం అందేలా పరిశీలన చేయాలని ఒకరిద్దరు మంత్రులు సీఎం రేవంత్ ముందు ప్రతిపాదన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.