
India Pakistan Water Dispute : సింధు నదీ జలాల పంపిణీ వివాదం భారత్, పాకిస్థాన్ మధ్య సరికొత్త ఉద్రిక్తతలకు దారితీసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పంద అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న కఠిన నిర్ణయంపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచివేసేంత వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని న్యూఢిల్లీ స్పష్టం చేయడంతో, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వైరం ముదిరింది.
భారత్ వైఖరిని నిరసిస్తూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని రగిల్చేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి వచ్చే నీటి సరఫరాను అడ్డుకుంటే అది నేరుగా జాతీయ భద్రతకు ముప్పుగా మారుతుందని ఆయన హెచ్చరించారు. తమ నీటి హక్కులను కాపాడుకోవడానికి పాకిస్థాన్ ఎలాంటి చర్యలకైనా సిద్ధమని, అవసరమైతే భారత్‌తో యుద్ధానికి వెనుకాడబోమని ఆయన బహిరంగంగా ప్రకటించారు.
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థతో పాటు కోట్లాది మంది ప్రజల తాగునీరు, సాగునీటి అవసరాలు పూర్తిగా సింధు నదీ వ్యవస్థపైనే ఆధారపడి ఉన్నాయని ఆసిఫ్ గుర్తుచేశారు. ఈ నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు భారత్ ప్రయత్నిస్తే తమ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తమ దేశ ప్రయోజనాల రక్షణ కోసం అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
నిజానికి భారత్, పాకిస్థాన్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం సింధు నదీ వ్యవస్థలోని ఆరు నదులను ఇరు దేశాల మధ్య పంపిణీ చేశారు. ఇందులో తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు సర్వాధికారాలు లభించగా.. పశ్చిమ దిశగా ప్రవహించే సింధు, జీలం, చీనాబ్ నదుల నీటిని వినియోగించుకునే హక్కును పాకిస్థాన్‌కు కేటాయించారు.
అయితే ఈ ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌కు దక్కిన నదులపై కూడా భారత్‌కు కొన్ని పరిమిత హక్కులు ఉన్నాయి. నదుల సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేయకుండా.. వాటిపై జలవిద్యుత్ ప్రాజెక్టులను నిర్మించుకోవడానికి, తాగునీరు, గృహ అవసరాలతో పాటు పరిమితంగా సాగునీటిని వాడుకోవడానికి భారత్‌కు చట్టబద్ధమైన అనుమతి ఉంది.
కానీ, పొరుగు దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నంత కాలం పాత పద్ధతిలో బంధాలు సాగవని భారత్ గట్టిగా చెప్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల చీనాబ్, జీలం నదులపై భారత్ కొన్ని కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఈ నిర్మాణాలపై ఇస్లామాబాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, ఉగ్రవాదంపై పాక్ తన ధోరణిని మార్చుకోకపోతే నీటి విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ ఖచ్చితమైన సంకేతాలు పంపింది.









