
Allu Arjun : సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు షాక్ ఇచ్చారు. ఈ కేసు విచారణకు సంబంధించి మొదటిసారి కోర్టుకు స్వయంగా హాజరుకావాలంటూ న్యాయస్థానం ఆదేశించినప్పటికీ, బన్నీ ఈరోజు కోర్టుకు వ్యక్తిగతంగా రాలేదు. తన తరఫున కోర్టు విచారణకు హాజరుకావాల్సిందిగా ఆయన తన అడ్వకేట్ ను పంపించారు. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా రాకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
సంధ్య థియేటర్ ప్రమాద ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో అల్లు అర్జున్ను A11 (11వ నిందితుడు)గా చేర్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే మొత్తం 23 మందిపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మొదటి విచారణకు ఖచ్చితంగా స్వయంగా హాజరుకావాలంటూ అల్లు అర్జున్‌తో పాటు ఈ కేసులో ఉన్న మిగతా 19 మందికి నాంపల్లి కోర్టు ఇదివరకే సమన్లు జారీ చేసింది.
అయితే, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అల్లు అర్జున్ పర్సనల్‌గా రాకపోవడంపై ఆయన లీగల్ టీమ్ స్పందించింది. బన్నీ ఈ విచారణకు వర్చువల్‌గా హాజరవుతారని లీగల్ టీమ్ చెబుతోంది. అంతేకాకుండా, ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలని, తనపై ఉన్న కేసును పూర్తిగా కొట్టేయాలని కోరుతూ అల్లు అర్జున్ త్వరలోనే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మొదటి విచారణకే స్వయంగా హాజరుకావాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, అల్లు అర్జున్ పర్సనల్‌గా రాకుండా న్యాయవాదిని పంపించడంపై నాంపల్లి న్యాయస్థానం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. కాగా బన్నీ ప్రస్తుతం రాక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.









