England ODI tour : ఇంగ్లాండ్ వన్డే పర్యటనకు సంబంధించిన భారత జట్టు ఎంపికలో సెలెక్టర్లు ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. జట్టులోకి సీనియర్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి వచ్చినప్పటికీ.. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. అలాగే శ్రేయస్ అయ్యర్ ఈ వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు స్థానం సంపాదించారు.ఆల్‌రౌండర్ల విభాగంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లతో పాటు తెలుగు యువ సంచలనం నితీష్ కుమార్ రెడ్డి సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక స్పిన్ బాధ్యతలను కుల్దీప్ యాదవ్ మోయనుండగా, పేస్ విభాగాన్ని యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా ముందుండి నడిపించనున్నాడు. అతనికి తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్‌లు పేస్ దళంలో చోటు దక్కించుకున్నారు.
ఇంగ్లాండ్ వన్డే జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.
ఐర్లాండ్ టీ20 సిరీస్: శ్రేయస్ కెప్టెన్సీ.. 15 ఏళ్ల వండర్ కిడ్‌కు పిలుపు!
ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత అప్‌డేటెడ్ టీ20 జట్టుకు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించగా, తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. అయితే, ఈ జట్టు ప్రకటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత సీనియర్ జట్టులో చోటు దక్కడం. ట్రై-సిరీస్ ఫైనల్లో కేవలం 11 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన లిస్ట్-ఏ హాఫ్ సెంచరీతో విమర్శకుల నోళ్లు మూయించిన సూర్యవంశీని సెలెక్టర్లు జట్టులోకి తీసుకుని బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఈ టీ20 జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే వంటి హిట్టర్లతో పాటు ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణాలకు అవకాశం దక్కింది. నితీష్ కుమార్ రెడ్డి వన్డేలతో పాటు ఈ టీ20 ఫార్మాట్‌లోనూ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం.
ఐర్లాండ్ టీ20 జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.