
Gottimukkala Padma Rao : తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు. కూకట్పల్లి వివేకానంద నగర్లోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున కన్ను మూశారు. పద్మారావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
గొట్టిముక్కల పద్మారావు 1954, నవంబరు 8న కూకట్పల్లిలో జన్మించారు. తండ్రిపేరు గొట్టిముక్కల రామారావు, తల్లిపేరు రాజ్యలక్ష్మీ. పద్మారావు బిఏ వరకు చదివారు. గొట్టిముక్కల పద్మారావుకు విజయలక్ష్మీతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు (సుజనారావు, సుష్మారావు, సుచరితారావు). పెద్ద కుమార్తె సుజనా రావు గమనం సినిమాకు దర్శకత్వం వహించారు.
1996లో తెలుగుదేశం పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి విశేషంగా కృషిచేశారు. ఆ సమయంలో జన్మభూమి కాలనీ పేరిట పేదలకు ఇళ్ళు కట్టించడంతోపాటు, పలు అభివద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. తరువాత మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. కూకట్పల్లి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ గా పనిచేసి, పార్టీ బలోపేతానికి విశేషంగా కృషిచేశారు. 2014లో కూకట్పల్లి నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి, తెలుగుదేశం అభ్యర్థి మాధవరం కృష్ణారావు చేతిలో ఓడిపోయారు.
టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా
2015లో హైదరాబాదు నగర మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కీలకపాత్ర పోషించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి నియోజకవర్గం నుండి టికెట్ అశించిన పద్మారావు, సీటు రాకపోవడంతో 2018 నవంబరు 18న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 2019 ఏప్రిల్ 1న జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్కాజ్ గిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలుపుకు కృషిచేశారు. 2022 నవంబరు 2న రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో భాగంగా బోయినపల్లి నుండి మియాపూర్ వరకు జరిగిన యాత్రలో పాల్గొన్నారు.
చిన్నప్పట్టి నుండి సినిమాలపై ఉన్న ఆసక్తితో పద్మప్రియ ఆర్ట్స్ బ్యానర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. తొలి సినిమాగా 1985లో రాజశేఖరరెడ్డి దర్శకత్వంతో సుమన్ హీరోగా కంచు కవచం సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో తనికెళ్ళ భరణిని రచయితగా, నటుడిగా పరిచయం చేశారు, ఆ సినిమాలో పద్మారావు పోలీస్ పాత్రలో కూడా నటించారు. 1986లో సి ఎస్ రావు దర్శకత్వం వహించిన శ్రీ వేమన చరిత్ర సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తరువాత వంశీ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా 1991లో ఏప్రిల్ 1 విడుదల, 1993లో జోకర్ వంటి సినిమాలను నిర్మించారు. 2006లో నీ నవ్వే చాలు సినిమాకు సమర్పకులుగా వ్యవహరించారు.









