
BJP : పార్లమెంటు ఉభయసభల్లోఅధికార ఎన్డీయే కూటమి తన బలాన్ని విపరీతంగా పెంచుకుంటోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న అంతర్గత పరిణామాలు, రాజీనామాలు బీజేపీకి భారీగా కలిసివస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యసభలో బిల్లులు పాస్ చేసుకోవడానికి అవసరమైన మూడింట రెండొంతుల (2/3) మెజారిటీకి ఎన్డీయే చాలా దగ్గరగా చేరుకుంటోంది. ఈ బలం గనుక వస్తే దేశంలో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ఈజీగా పాస్ చేయించుకోవడానికి బీజేపీకి రూట్ క్లియర్ అవుతుంది. రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీయే బలం పెరిగే ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాజ్యసభలో ఎన్డీయే కూటమి ప్రస్తుత బలం – 151. ఝార్ఖండ్, మిజోరంలలో జరిగిన రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో బీజేపీ సపోర్ట్ చేసిన స్వతంత్ర అభ్యర్థులు గెలవడంతో ఎన్డీయే బలం 151కి చేరుకుంది. తృణమూల్ కాంగ్రెస్ నుండి ఇటీవల ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఆ మూడు స్థానాలకు జరగబోయే ఉపఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, దీంతో ఎన్డీయే బలం 154కు చేరనుంది. రాజ్యసభలో 2/3 మెజారిటీ సాధించాలంటే ఎన్డీయేకు 163 మంది ఎంపీల మద్దతు కావాలి. అంటే మరో 9 సీట్లు తక్కువ పడ్డాయి. టీఎంసీ నుండి మరికొందరు ఎంపీలు గనుక రాజీనామా చేసి ఎన్డీయేలో చేరితే ఈ 163 మార్కును అందుకోవడం బీజేపీకి పెద్ద కష్టమేమీ కాదు.
కొన్ని నెలల మురిపెమే
ఒకవేళ బీజేపీ 2/3 మెజారిటీ సాధించినా అది కొన్ని నెలల మురిపెమే అయ్యేలా ఉంది. ఎందుకంటే ఈ ఏడాది నవంబర్‌లో ఉత్తరప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 10 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. యూపీ అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీ బలం పెరగడం వల్ల.. ఈసారి ఎస్పీ తరపున కొందరు ఎంపీలు రాజ్యసభకు వెళ్తారు, ఆ మేర బీజేపీ ఎంపీల సంఖ్య తగ్గుతుంది.
మరోవైపు విపక్ష ఇండియా కూటమి బలం ప్రస్తుతం 64కు పడిపోయింది. డీఎంకే (8 మంది ఎంపీలు), ఆప్ (3 గురు ఎంపీలు) ఇండియా కూటమికి కాస్త దూరంగా ఉండడం విపక్షాలకు మైనస్ అయింది. ఇక న్యూట్రల్‌గా ఉన్న వైఎస్సార్సీపీ (7 ఎంపీలు), బీజేడీ (7 ఎంపీలు), ఎండీఎంకే (1 ఎంపీ) ల మద్దతు బిల్లుల సమయంలో చాలా కీలకం కానుంది.
రాజ్యసభలో సీన్ అనుకూలంగా ఉన్నా, లోక్‌సభలో మాత్రం మూడింట రెండొంతుల మెజారిటీ (363 మంది ఎంపీలు) సాధించడం ఇప్పట్లో కష్టమేనని చెప్పాలి. కానీ బీజేపీ మాత్రం లోక్‌సభలో కూడా సూపర్ పవర్ సాధించడానికి భారీ స్కెచ్ వేసింది. లోక్‌సభలో ప్రస్తుతం ఎన్డీయే కూటమి బలం 294. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎంపీలు మమతా బెనర్జీకి షాక్ ఇస్తూ ఎన్డీయేకు సపోర్ట్ చేయడానికి రెడీ అయ్యారు. వీరు మద్దతు లేఖ ఇస్తే ఎన్డీయే బలం 314కు పెరుగుతుంది.లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు ఉన్నారు. అయితే అందులో నుండి 25 నుండి 30 మంది ఎంపీలు అఖిలేష్ యాదవ్‌ను వీడి ఎన్డీయే వైపు వస్తారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. అదే గనుక జరిగితే ఎన్డీయే బలం ఈజీగా 340 మార్కును దాటుతుంది. వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురు లోక్‌సభ ఎంపీలు కూడా ఎన్డీయేకే సపోర్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఒకవేళ టీఎంసీ, ఎస్పీ ఎంపీల చేరికతో ఎన్డీయే బలం ఒంటరిగానే పెరిగితే.. కూటమిలోని మెయిన్ పార్టీలైన టీడీపీ (16 ఎంపీలు), జేడీయూ (12 ఎంపీలు) ల ప్రాధాన్యత , డిమాండ్స్ ఎన్డీయేలో కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ వేరే వాళ్ల మద్దతుతో సేఫ్ జోన్లోకి వెళ్తుంది. లోక్‌సభలో రాజ్యాంగ సవరణకు అవసరమైన 363 మంది ఎంపీల మద్దతు (2/3 మెజారిటీ) సాధించడం కోసం.. టీఎంసీలోని మరో 8 మందికి, శరద్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ లోని 8 మందితో పాటుగా ఇతర చిన్న పార్టీల ఎంపీలకు బీజేపీ గాలం వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్లాన్స్ గనుక సక్సెస్ అయితే పార్లమెంట్ ఉభయసభల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించడం ఖాయమనే చెప్పాలి.









