
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షలో భారీ మోసం బయటపడింది. నీట్ అభ్యర్థులకు అందాల్సిన రీఫండ్ డబ్బులను కొట్టేయాలని ప్రయత్నించిన మోసాన్ని గుజరాత్ పోలీసులు పట్టుకున్నారు. విద్యార్థుల అకౌంట్లను హ్యాక్ చేసి ఈ మోసానికి పాల్పడుతున్న ఒక బిహార్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అసలు ఈ స్కామ్ ఎలా జరిగిందంటే?
నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కొన్ని కారణాల చేత రీఫండ్ కోరినప్పుడు, ఎన్టీఏ ఆ డబ్బును వారి ఖాతాల్లోకి జమ చేస్తుంది. దీనిని ఆసరాగా చేసుకున్న సదరు నిందితుడు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నీట్ అభ్యర్థుల అధికారిక ప్రొఫైల్స్‌ను హ్యాక్ చేశాడు. విద్యార్థుల యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను దొంగిలించి, వారి అకౌంట్లలోకి లాగిన్ అయ్యాడు. ఆ తర్వాత రీఫండ్ డబ్బులు రావాల్సిన విద్యార్థుల అసలు బ్యాంక్ ఖాతా వివరాలను మార్చేసి తన స్వంత లేదా దొంగ బ్యాంక్ ఖాతాల వివరాలను అక్కడ ఎంటర్ చేశాడు. దీనివల్ల విద్యార్థులకు అందాల్సిన లక్షలాది రూపాయల రీఫండ్ డబ్బులు నిందితుడి ఖాతాలోకి వెళ్లేలా ప్లాన్ చేశాడు.
🚨 A 19-year-old student from Bihar has been arrested by Ahmedabad Cyber Crime Police for allegedly hacking NEET UG 2026 candidates’ accounts.
He reportedly targeted around 350 accounts and successfully accessed nearly 150 of them by exploiting weak passwords and security gaps.… pic.twitter.com/1xWvFvQyO8
— Indian Tech & Infra (@IndianTechGuide) June 16, 2026
అయితే అభ్యర్థుల ప్రొఫైల్స్‌లో హఠాత్తుగా బ్యాంక్ వివరాలు మారడాన్ని ఎన్టీఏ ఐటీ విభాగం అధికారులు టెక్నికల్ ఆడిట్లో గమనించారు. అదే సమయంలో కొంతమంది విద్యార్థుల నుంచి కూడా తమ లాగిన్ అకౌంట్లు ఓపెన్ కావడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఎన్టీఏ అధికారులు వెంటనే గుజరాత్ పోలీసుల సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు డిజిటల్ ఆధారాలు, ఐపీ అడ్రస్‌లను ట్రాక్ చేస్తూ దర్యాప్తు చేపట్టారు. ఈ హ్యాకింగ్ అంతా బిహార్ నుంచి జరిగినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి నిందితుడిని పట్టుకున్నారు. అయితే దీని వెనుక మరికొంతమంది సైబర్ నేరగాళ్ల నెట్వర్క్ ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.









