అతివేగం ప్రాణాంతకమని పోలీసులు, రవాణా శాఖ అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ, రహదారులపై ప్రమాదాల తీవ్రత తగ్గడం లేదు. తాజాగా కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా పామూరు నుంచి బెంగళూరుకు శనివారం సాయంత్రం ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బయలుదేరింది. ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు, ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల సమయంలో బెంగళూరు సమీపంలోని చింతామణి ప్రాంతానికి చేరుకుంది. ఆ సమయంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక లారీని బస్సు అతివేగంతో వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 20 మందికి పైగా గాయాలయ్యాయి.వీరిలో 10 మందికి తీవ్ర గాయాలు కావడంతో, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను బస్సులో నుంచి వెలికితీసి, అత్యవసరంగా సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రమాదం జరిగిన అనంతరం ఆ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు వెంటనే స్పందించి, క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమా? లేక అతివేగమా? అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.










