Iran-Israel Missile Strikes
Iran-Israel Missile Strikes

Iran-Israel Missile Strikes : పశ్చిమాసియా ప్రాంతం మళ్లీ రణరంగంగా మారింది. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు పరస్పరం భీకర క్షిపణి దాడులతో విరుచుకుపడ్డాయి. ఏప్రిల్ రెండో వారంలో ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత, ఈ స్థాయిలో ఇరు దేశాలు దాడులు చేసుకోవడం ఇదే మొదటిసారి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పక్కనబెట్టి లెబనాన్ రాజధాని బీరుట్‌లోని ఇరాన్ అనుకూల హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడమే ఈ తాజా ఘర్షణకు దారితీసింది. ఇజ్రాయెల్ చర్యకు ప్రతికారంగా ఆదివారం రాత్రి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల వర్షం కురిపించడంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో మళ్లీ తీవ్ర యుద్ధ భయాలు నెలకొన్నాయి.

తమపై ఇరాన్ దాదాపు 30 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, అలాగే హెజ్బొల్లా కూడా రెండు క్షిపణులను వేసిందని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) ప్రకటించింది. అయితే తమ గగనతల రక్షణ వ్యవస్థ ఆ క్షిపణులన్నింటినీ సమర్థవంతంగా కూల్చేసిందని స్పష్టం చేసింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్‌కు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ‘మషెహర్ పెట్రోకెమికల్ ప్లాంట్’పై క్షిపణి దాడులు చేయగా, ఆ ప్లాంటు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ భీకర దాడుల్లో జరిగిన ప్రాణనష్టంపై ఇరు దేశాలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతానికి దాడులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్ మిలిటరీ.. ఒకవేళ బీరుట్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడి చేస్తే పశ్చిమాసియా మొత్తం యుద్ధంలోకి దిగుతుందని హెచ్చరించింది.

ఈ దాడుల తాలూకు సెగలు పొరుగున ఉన్న ఇరాక్, సౌదీ అరేబియాకు కూడా పాకినట్లు వస్తున్న వార్తలను సౌదీ అరేబియా ఖండించింది. తమ దేశంలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై ఎలాంటి దాడి జరగలేదని మేజర్ జనరల్ తుర్కీ మాలికీ స్పష్టం చేశారు. అయితే యెమెన్ నుంచి వచ్చిన ఒక బాలిస్టిక్ క్షిపణి సరిహద్దుల వైపు దూసుకురావడంతో హెచ్చరిక సైరన్లు మోగాయని, ఆ తర్వాత అది రాడార్ నుంచి మాయమైందని ఆయన వివరించారు. కాగా, ఈ క్షిపణి దాడులను తక్షణం ఆపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాలను హెచ్చరించారు. శాంతి చర్చలు జరుగుతున్న సమయంలో దాడులు చేసుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్, ప్రతిదాడి చేయవద్దని గట్టిగా చెప్పినట్లు సమాచారం. అలాగే ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకం చేసేవరకు హోర్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ దాడులు ప్రారంభం కావడంపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు వెంటనే దాడులను నిలిపివేసి, గరిష్ఠ సంయమనం పాటించాలని భారత విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో సుదీర్ఘంగా సాగుతున్న సైనిక ఘర్షణల వల్ల అంతర్జాతీయంగా తీవ్ర ఆర్థిక, మానవతా సంక్షోభాలు తలెత్తుతున్నాయని భారత్ గుర్తుచేసింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు తక్షణమే ఆ దేశాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అత్యవసర సూచనలు జారీ చేసింది.

భారతీయ నావికులున్న చమురు నౌకపై అమెరికా దాడి

పశ్చిమాసియా ఉద్రిక్తతల నడుమ ఒమన్ తీరంలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. భారతదేశంలోని కార్వార్ నుంచి ఒమన్‌లోని డుఖమ్‌కు వెళ్తున్న ‘ఎంటీ మారివెక్స్’ అనే ఖాళీ చమురు నౌకపై ఒమన్ తీరానికి 15 నాటికల్ మైళ్ల దూరంలో సోమవారం మధ్యాహ్నం అమెరికా నౌకాదళం దాడికి పాల్పడింది. పలావు దేశ పతాకంతో ప్రయాణిస్తున్న ఈ నౌక, అమెరికా విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘించి ఇరాన్, రష్యాల నుంచి ఇతర దేశాలకు చమురును తరలిస్తోందనే ఆరోపణలతోనే అమెరికా ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

అమెరికా నౌకాదళం జరిపిన ఈ దాడి కారణంగా ఎంటీ మారివెక్స్ నౌక ఇంజన్ వైపు పెద్ద రంధ్రం పడి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నౌకలోని లైఫ్ బోట్లు కూడా ధ్వంసమయ్యాయి. ప్రమాద తీవ్రతను గమనించిన నౌకలోని సిబ్బంది మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో అత్యవసర సహాయం కోసం సందేశం పంపారు. నౌకలో ఉన్న 24 మంది భారతీయ సిబ్బంది ఒమన్ అధికారుల సకాల సహాయంతో ఎటువంటి ప్రాణనష్టం లేకుండా సురక్షితంగా బయటపడ్డారని భారత నౌకాయాన శాఖ డైరెక్టర్ ఓపేశ్ కుమార్ శర్మ ధృవీకరించారు. విపత్కర స్థితిలో నౌకలోని ‘నీలేశ్’ అనే భారతీయ నావికుడు ఫోన్ చేసి సాయం కోరడంతో తాము రంగంలోకి దిగినట్లు ఆల్ ఇండియా సీఫేరర్స్ యూనియన్ వెల్లడించింది.