Ravana Puja Tradition
Ravana Puja Tradition

హిందూ సాంప్రదాయం ప్రకారం.. దేశ వ్యాప్తంగా ప్రజలు రాముడుని దేవుడి గానూ.. రావణాసురుడిని రాక్షసుడు గానూ భావిస్తారు. ఇందులో భాగంగానే దసరా పండుగ నాడు.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా భారీ కటౌట్లతో రావణాసురుడి బొమ్మలను దహనం చేస్తుంటారు. కానీ రావణాసురుడిని కూడా పూజించే భక్త ప్రజలు ఉన్నారంటే నమ్ముతారా?. అవునండీ మీరు విన్నది నిజమే.. మహారాష్ట్రలో ఆసక్తికరమైన సంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

అక్కడ రావణాసురుడిని దైవంలా భావిస్తారు. ప్రతిరోజు పూజలు చేస్తారు. దసరా, దీపావళి వచ్చిదంటే.. అక్కడ రావణ దహనానికి నో ఎంట్రీ. వినడానికి కొంచెం వింతగా, ఆశ్చర్యంగా అనిపించినా ఇది పచ్చి నిజం. మరి అక్కడి ప్రజలు ఎందుకు పూజిస్తారో? ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఉన్న సాంగోళా గ్రామ ప్రజలు రావణాసురుడిని దేవునిలా కొలుస్తారు. దసరా రోజు దేశమంతా రావణుడిని తగలబెడుతుంటే.. ఆ భక్త ప్రజలు మాత్రం హారతులు ఇచ్చి.. పసుపు, కుంకుమలతో పూజలు చేస్తారు. ఊరుఊరంతా విజయదశమి రోజు రావణుడి ప్రత్యేక విగ్రహానికి భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.

రావణుడిని ఎందుకు పూజిస్తారు..?

రావణుడిలో అహంకారం ఉన్నా.. ఆయన ఎంతో గొప్ప విజ్ఞానం, మేధస్సు కలిగిన వాడని.. శివునికి గొప్ప భక్తుడని, ఆయనలో తపస్శక్తి ఉన్నాయని ఆ గ్రామస్తులు గట్టిగా నమ్ముతారు. ఆయనలోని చెడును కాకుండా.. మంచి లక్షణాలను గౌరవించాలనే ఉద్దేశంతోనే దాదాపు 350 ఏళ్లుగా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. దీనికి గల కారణాలను కూడా ఆ గ్రామస్తులు వివరించారు.

స్థానికుల కథనం ప్రకారం.. ఆ గ్రామంలో ఒక మహారాజు ఋషి నివసించేవారు. గ్రామస్తులు ఆయనను ఎంతో గౌరవించేవారు. తన చివరి క్షణాల్లో ఆ మహారాజు ఋషి పది చుక్కలు లేదా చిహ్నాలతో కూడిన విగ్రహాన్ని ప్రతిష్టించమని కోరారు. అయితే శిల్పి రావణుడిని పోలిన పది ముఖాలున్న విగ్రహాన్ని చెక్కాడు. ఈ విగ్రహాన్ని ఎద్దుల బండిపై గ్రామానికి తీసుకువెళ్తున్నప్పుడు.. అది గ్రామ సరిహద్దు వరకు వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత ఎంతసేపటి అక్కడ నుంచి కదలకపోవడంతో గ్రామస్తులు దానిని దైవ సంకేతంగా భావించి.. ఆ విగ్రహాన్ని అదే ప్రదేశంలో ప్రతిష్టించారు. అప్పటి నుంచే దశముఖ రావణుడిని గ్రామ దేవతగా పూజించే సంప్రదాయం మొదలైందని చెబుతారు. ఇది ఆ గ్రామంలో తరతరాలుగా వస్తున్న ఒక ప్రసిద్ధ నమ్మకం. బంగారు లంక రాజు రావణుడిని పూజించడం వల్లే తమ గ్రామం సుఖసంతోషాలతో, బంగారంలా సుసంపన్నమైందని గ్రామస్తులు నమ్ముతారు. ఆయనను పూజించడం వల్ల గ్రామం కష్టాల నుండి సురక్షితంగా ఉంటుందని చెబుతారు.