
Bangladesh : బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సముద్ర తీరంలోని ఓ రిసార్ట్‌లో మంటలు చెలరేగడంతో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో అక్కడి ప్రాంతంలో విషాదం నెలకొంది. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలో ఉన్న ఇనాని ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. పటువార్టెక్ బీచ్ సమీపంలోని మెరైన్ డ్రైవ్ దగ్గర ఉన్న ‘టప్‌టప్ రెస్టో అండ్ రిసార్ట్’లో ఉదయం 6.30 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మూడు అంతస్తుల ఈ రిసార్ట్‌ను ఎక్కువగా వెదురు, చెక్కతో నిర్మించారు. దీంతో మంటలు వేగంగా వ్యాపించి భవనం మొత్తం కాలిపోయింది.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అయితే, అప్పటికే మంటలు భవనం అంతటా వ్యాపించాయి. రిసార్ట్ మొత్తం కాలిపోయిందని కాక్స్ బజార్ అగ్నిమాపక శాఖ అధికారి సయ్యద్ మహమ్మద్ మోర్షెద్ హొస్సేన్ తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.
కాక్స్ బజార్ జిల్లా కలెక్టర్ ఏ. మన్నన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు ఆరు మృతదేహాలను బయటకు తీశారు. మృతుల వివరాలు తెలుసుకునేందుకు డీఎన్ఏ నమూనాలు సేకరించిన తర్వాతే మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించనున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కాక్స్ బజార్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యాధికారి సబుక్తగిన్ మహమూద్ సోహెల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదుగురికి శరీరంపై సుమారు 5 శాతం మేర కాలిన గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తి కింద పడటంతో గాయపడ్డాడు. అతడికి ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఆసుపత్రి నుంచి పంపించారు.
మంటలు చెలరేగిన సమయంలో రిసార్ట్‌లో సుమారు 30 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో నలుగురు లేదా ఐదుగురు మాత్రమే బయటకు రాగలిగారు. మిగతా వారి పరిస్థితి, ఆచూకీ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రిసార్ట్‌లో మంటలు ఎలా మొదలయ్యాయి? ప్రమాద సమయంలో లోపల ఎంతమంది చిక్కుకున్నారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య, గల్లంతైన వారి వివరాలపై మరింత సమాచారం రావాల్సి ఉంది.









