
Abhijeet Dipke : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే తీవ్ర ఆరోపణలు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను కాపాడటం కోసమే ప్రభుత్వం తన అధికారాలను ఉపయోగిస్తోందని ఆయన ఆరోపించారు. నేహా బోరా, నటుడు ప్రకాశ్ రాజ్తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో దీప్కే ఈ వ్యాఖ్యలు చేశారు.
జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న యువతను పోలీసులు అడ్డుకుంటున్నారని, రోడ్లపైకి లాగుతున్నారని ఆరోపించారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు ఒక్క జ్ఞానేశ్ కుమార్ను కాపాడటం కోసమేనా అని ప్రశ్నించారు. సొంత దేశ ప్రజలపైనే ప్రభుత్వం యుద్ధం చేస్తున్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఎన్నికల సంఘం పనితీరుపై కూడా దీప్కే అనుమానాలు వ్యక్తం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి మధ్య ఓట్ల తేడా సుమారు రెండు శాతమే ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారేమోనని ప్రజలు ఎందుకు అనుమానించకూడదని ప్రశ్నించారు. SIR ప్రక్రియపైనా ఆయన విమర్శలు చేశారు. ఈ ప్రక్రియలో 13 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించారని దీప్కే ఆరోపించారు. సవరణ సమయంలో కొంతమందిని చనిపోయినవారిగా గుర్తించారని, అలాంటి వ్యక్తులను తాను కలిశానని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వన్ నేషన్, వన్ ఎలక్షన్ విధానంపైనా దీప్కే విమర్శలు చేశారు. అది కేవలం ఓ నినాదం మాత్రమేనని, ప్రభుత్వ అసలు లక్ష్యం వన్ నేషన్, వన్ పార్టీ అని ఆరోపించారు. ప్రధాని మోదీకి నిజంగా అత్యవసర పరిస్థితి విధించాలనే ఆలోచన ఉంటే ప్రకటించాలని, అప్పుడు అంతర్జాతీయ సమాజం ఎలా స్పందిస్తుందో కూడా ఆలోచించాలని వ్యాఖ్యానించారు.









