
దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏడాది శీతాకాలంలో తీవ్రమైన వాయు కాలుష్యం నమోదై అక్కడి ప్రజలను భయందోళనకు గురిచేస్తుంది. విషపూరితమైన పొగమంచు వల్ల ప్రజలు తీవ్ర శ్వాసకోశ సమస్యలు, అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇదంతా తరచూ జరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఈ ప్రాణాంతక సమస్యకు ముగింపు పలికేందుకు ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (DPCC) సంయుక్తంగా అధునాతన టెక్నాలజీతో ఒక అడుగు ముందుకువేశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే ‘ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ (ICCC) ను అందుబాటులోకి తీసుకువచ్చాయి.
Also Read : రూ.2 కోసం రూ.లక్ష ఫైన్.. వాటర్ బాటిల్‌తో వాత పెట్టిన కస్టమర్!
ఇది ఎలా పనిచేస్తుంది?
గతంలో కాలుష్య నియంత్రణకు సంబంధించి పలు డిపార్ట్మెంట్ల నుంచి పంపే సమాచారం, డేటాపై ఆధారపడంతో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరిగేది. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ICCC అనేది.. ఢిల్లీలోని నలు మూలల నుంచి కాలుష్య సమాచారాన్ని ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకొచ్చే ఒక కేంద్రవ్యవస్థ. ఇది మూడు సూత్రాలపై పనిచేస్తుంది. అందులో
1. నిరంతర పర్యవేక్షణ: ఈ వ్యవస్థ గాలి నాణ్యత, ధూళి, సౌండ్, పలు కంపెనీల నుంచి వచ్చే పొగ వంటి వివరాలను నిరంతరం పర్యవేక్షిస్తుంది.
2.AI ఆధారిత విశ్లేషణ: కాలుష్యం ఎక్కువగా ఉండే ‘హాట్‌స్పాట్’ ప్రాంతాలను, కాలుష్య కారకాలను వెంటనే గుర్తిస్తుంది.
3. స్పాట్ రియాక్షన్: ఎప్పుడైనా అధికస్థాయిలో కాలుష్యం, సౌండ్స్, పొగ నమోదైన వెంటనే క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం అందించి.. కాలుష్య నివారణ చర్యలను పర్యవేక్షిస్తుంది.
ఈ ఏఐ ఆధారిత ICCC వ్యవస్థ.. గాలి నాణ్యత, నిర్మాణ స్థలాల ధూళి, పంట వ్యర్థాలను కాల్చడం, సౌండ్ పొల్యూషన్ వంటి అన్ని అంశాలను ఒకేసారి లైవ్ మ్యాప్‌లో అధికారులకు అందిస్తుంది. అంతేకాకుండా నగరవ్యాప్తంగా ఉన్న పర్యవేక్షణ కేంద్రాల ద్వారా వాయు నాణ్యతను పరిశీలించి.. ఏమైనా స్థాయిలు పరిమితి దాటితే వెంటనే రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే కాలుష్యానికి గల కారణాన్ని గుర్తిస్తుంది. ఇది 24×7 పర్యవేక్షణలో ఉంటుంది. ఫ్యాక్టరీలను పరిశీలిస్తుంది. ఒకవేళ కంపెనీలు విషవాయువులను పరిమితికి మించి రిలీజ్ చేస్తే AI వెంటనే గుర్తించి వార్నింగ్ ఇస్తుంది.
ఇది మాత్రమే కాకుండా గాలిలోని ధూళి కణాలకు కారణమైన నిర్మాణ ప్రాంతాలను కూడా లైవ్ సీసీటీవీ కెమెరాల ద్వారా చెక్ చేస్తుంది. అలాగే రోడ్లను శుభ్రపరిచే మెకానికల్ యంత్రాల కదలికలను సైతం ట్రాక్ చేస్తుంది. ఎవరైనా చెత్తకాల్చడం, ధూళి కాలుష్యంపై మొబైల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే దగ్గర్లోని ఫీల్డ్ ఆఫీసర్‌కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. వెంటనే ఫీల్డ్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లి పరిస్థితిని కంట్రోల్ చేసి.. జియో ట్యాగ్‌తో అక్కడి ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇలా ఏఐ సహాయంతో ముందుగానే గుర్తించడం వల్ల పొగమంచు ఏర్పడకముందే ఆయా ప్రాంతాల్లో ‘యాంటీ-స్మోగ్ గన్స్’ లేదా నీటి స్ప్రింక్లర్లతో కంట్రోల్ చేయవచ్చు. అయితే దీనివల్ల ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చగలుగుతారా? అనే ప్రశ్న అందిరిలోనూ తలెత్తింది. అయితే ఈ ఏఐ ఆధారిత కంట్రోల్ రూమ్ అనేది కాలుష్యాన్ని కంట్రోల్ చేసే ఒక సాధనం మాత్రమే తప్ప.. అది నేరుగా నివారించలేదు. ఇది కాలుష్య సమాచారాన్ని అందించడం వల్ల ఫీల్డ్‌లో ఉన్న అధికారులే దీనిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది.
Also Read : వాట్సాప్ యాప్ లేకున్నా ఫ్రీ కాల్స్.. అదిరిపోయే ‘గెస్ట్ కాల్స్’ ఫీచర్ వచ్చేసింది..!









