Azerbaijan : పంచంలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటైన అజర్‌బైజాన్‌లో హిజాబ్ వివాదం మొదలైంది. స్కూళ్లకు హిజాబ్ ధరించి వస్తున్న కొందరు విద్యార్థినులు, ఉపాధ్యాయులను అధికారులు వెనక్కి పంపుతున్నారనే వార్తలు ఆందోళనకు దారితీశాయి. దీంతో మత స్వేచ్ఛ, విద్యలో లౌకిక విధానాలపై చర్చ మొదలైంది. దేశ జనాభాలో దాదాపు 96 శాతం మంది ముస్లింలుగా గుర్తింపు పొందినప్పటికీ.. హిజాబ్ ధరించి స్కూళ్లకు వెళ్లకుండా ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి.

అజర్‌బైజాన్ ప్రభుత్వం సెప్టెంబర్ 21న స్కూల్ యూనిఫాం నిబంధనల్లో మార్పులు చేసింది. నిర్ణయించిన దుస్తుల నియమాలకు విరుద్ధంగా ఉండే దుస్తులు ధరించకూడదని, దేశ విద్యా విధానంలోని లౌకిక సూత్రాలకు అనుగుణంగా ఉండాలని ఈ నిబంధనల్లో పేర్కొంది. అయితే, ఈ నిబంధనల్లో హిజాబ్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయినప్పటికీ, వాటిని అమలు చేస్తున్న తీరు వల్ల హిజాబ్ ధరించి వచ్చిన కొందరు విద్యార్థినులు, ఉపాధ్యాయులను స్కూళ్లలోకి అనుమతించడం లేదని వార్తలు వచ్చాయి. దీంతో కొన్ని చోట్ల నిరసనలు, తరగతుల బహిష్కరణలు జరిగాయి.

హిజాబ్ ధరించకూడదని తనకు చెప్పడంతో తీవ్రంగా బాధపడ్డానని ఉపాధ్యాయురాలు జహ్రా హసనోవా తెలిపారు. తలకు స్కార్ఫ్ ధరించాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయమని ఆమె అన్నారు. “నిజం చెప్పాలంటే నాకు చాలా బాధగా ఉంది. మనసు కలచివేస్తోంది. హిజాబ్ ధరించాలా వద్దా అనేది నా వ్యక్తిగత నిర్ణయం. ఒకరోజు దాన్ని తీసేయాలని అనుకున్నా అది కూడా నా ఇష్టమే కావాలి” అని ఆమె అల్ జజీరాతో చెప్పారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కనీసం రెండు స్కూళ్లలో విద్యార్థులు ఈ ఆంక్షలను వ్యతిరేకిస్తూ తరగతులను బహిష్కరించారు. హిజాబ్ ధరించిన కారణంగా స్కూళ్లలోకి అనుమతించకపోవడంతో విద్యార్థినులు కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు విద్యార్థులు తమ ఉపాధ్యాయులను కౌగిలించుకుని ఏడుస్తున్న వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించాయి.

హిజాబ్‌పై ఆంక్షలు ఎందుకు?

స్కూళ్లలో అందరికీ ఒకే రకమైన దుస్తుల నిబంధనలు ఉండాలని, విద్యా వ్యవస్థ లౌకిక విధానాలను పాటించాలని అజర్‌బైజాన్ ప్రభుత్వం చెబుతోంది. ఉపాధ్యాయులు కూడా వృత్తికి తగిన దుస్తులు ధరించాలని, స్కూల్ వాతావరణానికి అనుగుణంగా ఉండాలని పేర్కొంటోంది. సెప్టెంబర్ 21న చేసిన మార్పుల ఉద్దేశం స్కూళ్లలో అందరికీ ఒకే విధమైన దుస్తుల నియమాలను అమలు చేయడమే. దేశంలోని లౌకిక విద్యా విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత అక్టోబర్ 6న ఉపాధ్యాయుల దుస్తులకు సంబంధించి మరో నిర్ణయం తీసుకున్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.