ఢిల్లీలోని జంతర్‌మంతర్‌(Delhi Jantar Mantar) వద్ద కాక్రోచ్‌ జనతా పార్టీ శాంతియుత నిరసనలకు రెడీ కావడంతో పోలీసులు దానిని నిరసన ప్రాంతంగా తొలగించారు. మూడు దశాబ్దాలకుపైగా నిరసనలు, ప్రదర్శనలకు వేదికగా కొనసాగుతున్న జంతర్‌ మంతర్‌లో ఇకపై నిరసనలకు అవకాశం లేదని ప్రకటించారు. అయితే ఈ జంతర్ మంతర్ ఎలా ఉద్యమాల వేదికగా మారింది? దీని వెనుక ఉన్న కథ ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జంతర్ మంతర్‌ను 18వ శతాబ్దపు ప్రారంభంలో నిర్మించారు. 1724వ సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా పరిపాలిస్తున్న కాలంలో దీని నిర్మాణం జరిగింది. ఆ సమయంలో ఆకాశంలో గ్రహాల స్థానాలు, సూర్య చంద్రుల గమనం, కాలాన్ని సరిగ్గా లెక్కించడంలో పండితుల మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చేవి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చక్రవర్తి మహమ్మద్ షా.. ఖగోళ శాస్త్రంపై తీవ్రమైన పట్టు, ఆసక్తి ఉన్న జైపూర్ మహారాజు సవాయ్ జై సింగ్-2 ను సంప్రదించారు. గ్రహాల స్థానాలను ఖచ్చితంగా కొలవడానికి ఒక అత్యాధునిక వేధశాలను నిర్మించాలని ఆయనను కోరారు. అలా జైపూర్ రాజా జై సింగ్-2 పర్యవేక్షణలో ఢిల్లీ నడిబొడ్డున నిర్మించబడిందే ఈ జంతర్ మంతర్.

Also Read : వ్యాపారులకు యూపీఐ షాక్.. పండుగ తర్వాత ఛార్జీల మోత!

సంస్కృత పదాలైన యంత్ర, మంత్ర అనే పదాల నుంచి జంతర్ మంతర్ అనే పేరు వచ్చింది. అంటే సమయాన్ని, ఖగోళ గమనాలను లెక్కించే యంత్రం అని దీని అర్థం. ఇక్కడ నిర్మించిన కట్టడాలు కేవలం రాతి గోడలు కావు. ఇవి అతిపెద్ద కొలమాన పరికరాలు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సూర్య గడియారం. ఇది సెకన్ల విరామంతో సహా స్థానిక సమయాన్ని ఖచ్చితంగా చూపిస్తుంది. ఇది ఆకాశంలో నక్షత్రాల స్థానాన్ని, కాలమార్పులను కొలవడానికి ఉపయోగించే అర్ధగోళాకార పరికరం. గ్రహాల ఎత్తు, దిశలను కొలవడానికి దీనిని ఉపయోగించేవారు. ఇలాంటి వేధశాలలను రాజా జై సింగ్ ఒక్క ఢిల్లీలోనే కాకుండా జైపూర్, ఉజ్జయిని, వారణాసి, మధురలలో కూడా నిర్మించారు. వీటిలో జైపూర్, ఢిల్లీ జంతర్ మంతర్లు ప్రసిద్ధి చెందాయి.

కాలక్రమేణా ఆధునిక సాంకేతికత పెరగడంతో ఈ రాతి పరికరాల వాడకం తగ్గింది. అయితే 20వ శతాబ్దం చివరి నాటికి ఢిల్లీ రాజకీయ స్వరూపం మారిపోయింది. అప్పట్లో ఇండియా గేట్ సమీపంలోని బోట్ క్లబ్ దేశ రాజధానిలో ప్రధాన నిరసన వేదికగా ఉండేది. కానీ 1988లో రైతు నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులతో జరిగిన భీకర ఆందోళనతో ఢిల్లీ స్తంభించిపోయింది. భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం బోట్ క్లబ్ వద్ద నిరసనలను నిషేధించింది. బోట్ క్లబ్‌కు ప్రత్యామ్నాయంగా 1993 నాటికి కన్నాట్ ప్లేస్ సమీపంలోని జంతర్ మంతర్ వీధిని అధికారులు ఆందోళనలకు కేటాయించారు. పార్లమెంటుకు చాలా దగ్గరగా ఉండటంతో ఇది దేశంలోనే అతిపెద్ద నిరసనల అడ్డాగా మారింది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటం నుండి నిర్భయ ఘటన ఆగ్రహావేశాలు, క్రీడాకారుల ధర్నాల వరకు ఎన్నో చారిత్రక ఉద్యమాలకు జంతర్ మంతర్‌లోనే జరిగాయి.

Also Read : మాజీ ఎమ్మెల్యేను దారుణంగా కొట్టి చంపిన గ్రామస్తులు.. అసలు కారణమిదే!