
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ అమెరికాలో త్వరలో జరగబోయే మధ్యంతర ఎన్నికల కోసం ఎవరికీ తెలియకుండా భారీ మొత్తంలో డబ్బులు కుమ్మరించారు. రిపబ్లికన్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా ఏకంగా దాతగా మారిపోయారు. ఈ ఏడాది జూలై నుంచి ఇప్పటివరకు ఎలాన్ మస్క్ ఏకంగా 276 మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు ఇచ్చారు.
అసలు ఈ డబ్బు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారంటే.. రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే సెనేట్ లీడర్‌షిప్ ఫండ్ అనే ప్రధాన సంస్థకు మస్క్ ఏకంగా 158 మిలియన్ డాలర్లు ఇచ్చారు. అలాగే ఆయన స్వయంగా నడిపే అమెరికా ప్యాక్ అనే సంస్థకు మరో 76 మిలియన్ డాలర్లు వెళ్లాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్‌ను గెలిపించడానికి ఓటర్లను ఏకం చేసిన టీమ్ లాగానే ఇప్పుడు కూడా అలాంటి భారీ ప్రచారాన్ని మళ్లీ నడిపిస్తున్నారు. అంతేకాదు టెక్సాస్‌లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి కోసం మరో 10 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.
Also Read : రష్యా-పాక్ సరికొత్త డ్రామా.. ఇస్లామాబాద్‌లో దిగిన పుతిన్ రైట్ హ్యాండ్.. భారత్‌కు ముప్పు తప్పదా?
కొద్ది రోజుల క్రితం ఇకపై తాను రాజకీయాలకు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టనని మస్క్ చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన రూటు మార్చి ఒక్కసారిగా భారీగా విరాళాలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి వేదికలపై తిరిగిన మస్క్.. ఇప్పుడు కాస్త కనిపించకుండా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ప్రభుత్వ పదవుల నుంచి తప్పుకున్నప్పుడు ట్రంప్‌తో చిన్నపాటి మనస్పర్థలు వచ్చినా ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయి. ఇటీవలే ట్రంప్ స్వయంగా మస్క్‌కు జాతీయ విజ్ఞాన పతకాన్ని కూడా అందజేశారు.
మస్క్ ఇస్తున్న ఈ భారీ నిధులు రిపబ్లికన్ పార్టీకి పెద్ద బలమైపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ధరల పెరుగుదల, ఇతర సమస్యల వల్ల ప్రజలు డెమోక్రాట్లపై కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఈ సమయంలో మస్క్ ఇస్తున్న డబ్బులను ఆ పార్టీ ఎన్నికల ప్రచారానికి, తమ వాదనలను ప్రజల్లోకి దూసుకువెళ్లేలా చేయడానికి విపరీతంగా వాడుకుంటోంది. మరోవైపు డెమోక్రాట్లు మాత్రం మస్క్ తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. రిపబ్లికన్లు తమ బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి, ఈ ఎన్నికలను డబ్బులతో కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.
Also Read : సౌదీని వణికిస్తున్న హూతీ దాడులు.. కుప్పకూలిన ఎయిర్ డిఫెన్స్.. అసలు ఏం జరుగుతోంది?









