
అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఊహించని షాక్ తగిలింది. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల ద్వారా నేరుగా వేగవంతమైన ఇంటర్నెట్ అందించే ‘స్టార్‌లింక్’ సేవలను పలు దేశాలు బ్యాన్ చేయడమే కాకుండా మరికొన్ని దేశాలు తీవ్రమైన ఆంక్షలు విధించాయి.
ముఖ్యంగా చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా, బెలారస్, సిరియా, మయన్మార్ వంటి దేశాలు సెన్సార్షిప్, జాతీయ భద్రత, కమ్యూనికేషన్లపై ప్రభుత్వ నియంత్రణ పేరుతో స్టార్‌లింక్ సేవలను తమ దేశాల్లో పూర్తిగా అడ్డుకున్నాయి. అలాగే భారత్, దక్షిణాఫ్రికా, నమీబియా వంటి దేశాలలో స్థానిక టెలికాం నిబంధనలు, లైసెన్సింగ్ అనుమతులు, యాజమాన్య హక్కుల కారణాల వల్ల స్టార్‌లింక్ వాణిజ్య విస్తరణకు బ్రేకులు పడ్డాయి. సాంకేతికంగా ఆకాశం నుంచి ఇంటర్నెట్ సిగ్నల్స్ అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో మస్క్ సంస్థకు అనేక దేశాల్లో నో ఎంట్రీ బోర్డులు ఎదురవుతున్నాయి.
చైనా: ఇంటర్నెట్పై ప్రభుత్వ ఆంక్షలు ఉండటంతో సేవలకు ఇక్కడ అనుమతి ఇవ్వలేదు.
రష్యా: అధికారిక అనుమతి లేని ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించింది.
ఉత్తర కొరియా: సమాచార వ్యవస్థపై పూర్తి ప్రభుత్వ నియంత్రణ ఉండటంతో సాధారణ ప్రజలు స్టార్‌లింక్ వాడటం అసాధ్యం.
ఇరాన్: టెలికాం, భద్రతా నియమాల కారణంగా స్టార్‌లింక్ టెర్మినల్స్‌పై ఆంక్షలు ఉన్నాయి.
క్యూబా: అనధికారిక నెట్‌వర్క్‌లపై ఉన్న ఆంక్షల వల్ల స్టార్‌లింక్ వినియోగానికి బ్రేకులు పడ్డాయి.
బెలారస్: భద్రతాపరమైన ఆంక్షల కారణంగా ఇక్కడ స్టార్‌లింక్ సేవలు అందుబాటులో లేవు.
సిరియా: అంతర్జాతీయ ఆంక్షలు, స్థానిక టెలికాం పరిమితుల వల్ల ఇక్కడ సేవలు అందించడం కష్టం.
మయన్మార్: ప్రభుత్వ నియంత్రణల కారణంగా అనధికారిక శాటిలైట్ పరికరాల వాడకంపై నిషేధం ఉంది.
హాంగ్ కాంగ్ & మకావు: చైనా ఆధీనంలో ఉన్నప్పటికీ ఇక్కడ టెలికాం నియమాలు ఉంటాయి.
Also Read : ఇమ్రాన్ ఖాన్‌కు మరో దెబ్బ.. పీటీఐ పాలనపై గవర్నర్ పాలన!
స్టార్‌లింక్‌ను వద్దు అనడానికి కారణాలు
సాధారణంగా టెలికాం కేబుల్స్ ద్వారా వచ్చే ఇంటర్నెట్పై ప్రభుత్వాలకు పూర్తి నియంత్రణ ఉంటుంది. కానీ స్టార్‌లింక్ నేరుగా అంతరిక్షంలోని ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ ఇస్తుంది. దీంతో ప్రభుత్వాలు ప్రజలు ఏం చూస్తున్నారో కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. అందుకే సెన్సార్షిప్ ఎక్కువగా ఉన్న దేశాలు దీనిని అడ్డుకుంటాయి. అలాగే యుద్ధాలు జరిగినప్పుడు లేదా టవర్లు దెబ్బతిన్నప్పుడు ఈ శాటిలైట్ ఇంటర్నెట్ బాగా పనిచేస్తుంది. అయితే తమ అనుమతి లేకుండా విదేశీ టెక్నాలజీని వాడటం వల్ల దేశ భద్రతకు ముప్పు వస్తుందని కొన్ని దేశాలు భావిస్తాయి. ఏ దేశంలోనైనా వ్యాపారం చేయాలంటే ఆ దేశ ప్రభుత్వ అనుమతులు, లైసెన్సులు తీసుకోవాలి. కొన్ని దేశాలు స్థానిక కంపెనీలతో కలిసి పనిచేయాలని నిబంధనలు పెడతాయి. ఇవి పాటించకపోతే సేవలు ఆగిపోతాయి.
భారతదేశంలో ఎందుకు ఇంకా రాలేదు?
మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ రావాలంటే ప్రభుత్వ అనుమతులు, లైసెన్సులు, స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియ పూర్తి కావాలి. ఇవన్నీ పూర్తయితేనే స్టార్‌లింక్ మన దేశంలో పనిచేస్తుంది. పైగా మన దేశంలో ఇప్పటికే చాలా మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లు పోటీలో ఉన్నాయి. అయితే కేవలం పోటీ ఉందనే కారణంతో స్టార్‌లింక్‌ను భారత్ నిషేధించలేదు.. ఇంకా అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది.
దక్షిణాఫ్రికా, నమీబియాలో సమస్య ఏంటి?
దక్షిణాఫ్రికాలో బిజినెస్ చేయాలంటే టెలికాం లైసెన్సులతో పాటు స్థానిక ఆర్థిక భాగస్వామ్య నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నమీబియాలో టెలికాం రెగ్యులేటరీ సంస్థ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాన్ చేయలేదు. కేవలం సేవలు మాత్రమే ఆలస్యం చేశారు.
Also Read : పిచ్చెక్కిపోతారు: నీటిలో రయ్ రయ్.. SPA సీట్లతో కొత్త కారు.. కిర్రాక్ ఫీచర్లు..!
అసలు స్టార్‌లింక్ ఎలా పనిచేస్తుంది?
స్టార్‌లింక్ అనేది ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ సంస్థ ఇంటర్నెట్ నెట్వర్క్. ఇది భూమికి చాలా తక్కువ ఎత్తులో ఉండే శాటిలైట్ల ద్వారా నేరుగా ఇంటర్నెట్ను అందిస్తుంది. ఇవి భూమికి దగ్గరగా ఉండటం వల్ల ఇంటర్నెట్ చాలా వేగంగా పనిచేస్తుంది. ముఖ్యంగా టవర్లు లేని మారుమూల గ్రామాలు, అడవులు, కొండ ప్రాంతాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది.









