
ఇటీవల మహారాష్ట్రలోని పూణేలో కేతన్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కేతన్‌ను అతని ప్రియురాలైన సియా లోహగడ్ కోట పైనుంచి తోసి చంపేసింది. అయితే ఇప్పుడు అలాంటి ఘటనే మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఓ తేడా ఉంది. ప్రియుడే తన ప్రియురాలిని లోతైన లోయలోకి తోసి చంపేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
25 ఏళ్ల శ్రీపద్ దింకర్, 23 ఏళ్ల తరణుమ్ బషీర్ నాయక్ కొల్హాపూర్ జిల్లా గర్గోటిలోని అవధూత్ కాలనీలో ఒకరి ఇంటి ఎదురెదురుగా ఒకరు నివసించేవారు. అదే సమయంలో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. దీంతో ప్రేమలో మునిగితేలుతున్న క్రమంలో ప్రియుడు శ్రీపద్కు పెద్ద షాక్ తగిలింది. అతడి ప్రియురాలు తరణుమ్కు పెళ్లి నిశ్చయమైంది. ఆమె పెళ్లికి ఒప్పుకోవడంతో పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు.
ఇదే విషయాన్ని తరణుమ్ తన ప్రియుడికి చెప్పింది. ‘‘నాకు పెళ్లి ఖాయమైంది. ఇకనుంచి నీతో ప్రేమను కొనసాగించలేను’’ అని తెలిపింది. ఇదే విషయంపై వారిద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగి.. చివరికి బ్రేకప్ అయి ఎవరిదారి వారు చూసుకున్నారు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియుడు శ్రీపద్ ఆమెను అంతం చేయాలని అనుకున్నాడు. ఎలాగైన తన పగ తీర్చుకోవాలని పక్కా ప్లాన్ వేశాడు.
ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆమెతో మాట్లాడాలని.. ఆమెను నాయక్వాడి సమీపంలోని ఒక లోతైన లోయవద్దకు తీసుకెళ్లాడు. అక్కడ వారిద్దరి మధ్య మరోసారి వివాదం మొదలైంది. అప్పుడు కూడా తనకు పెళ్లి నిశ్చయమైందని, ప్రేమ వ్యవహారం ఇకపై కొనసాగించలేనని తరణుమ్ తన ప్రియుడికి చెప్పింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీపద్.. తన ప్రియురాలు తరణుమ్‌ను లోయలోకి తోసి చంపేశాడు. ఈ ఘటన తర్వాత నిందితుడు ఒక కొత్త నాటకం మొదలెట్టాడు.
తన ప్రియురాలు కనిపించడం లేదని ఒక కట్టుకథ అల్లి భూదర్గడ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొదట నిందితుడిని ప్రశ్నించారు. ఈ విచారణలో తడబడిన శ్రీపద్.. చివరికి నిజం ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ విషయం గురించి తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. వెంటనే హాస్పిటల్‌కు చేరుకుని కూతురిని ఆఖరిచూపు చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.









