తెలంగాణ సాంస్కృతిక ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ. ఆడపడుచులంతా ఒక దగ్గర కలిసి ఆనందంగా పూలతో జరుపుకునే పండుగ ఇది. నేటి నుంచి బతుకమ్మ సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా మొదలవుతాయి. దసరా పండుగకు ముందు వచ్చే ఈ తొమ్మిది రోజులు ఊరంతా ఒకేలా సందడిగా, సంతోషంగా మారిపోతుంది. తంగేడు, గునుగు, కట్ల, బంతి, చామంతి లాంటి రకరకాల ఊరి పూలను పొలాల నుంచి సేకరించి వాటిని తాంబాళంలో పేర్చి అందమైన బతుకమ్మను తయారు చేస్తారు. దాని పైన పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని రోజుకో రకంగా పూజిస్తూ, విభిన్నమైన ప్రసాదాలను నివేదిస్తారు.

Also Read : హైదరాబాద్‌లో IRS అధికారి ఆత్మహత్యాయత్నం.. నాలుగో అంతస్తు నుంచి దూకి!

తొమ్మిది రోజుల పూజా విధానం, నైవేద్యాలు
మొదటి రోజు – ఎంగిలి పూల బతుకమ్మ
బతుకమ్మ వేడుకలు ఈ రోజుతోనే మొదలవుతాయి. పెత్రమాస రోజున పూలను సేకరించి తేవడం వల్ల దీన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. ఈ రోజున బియ్యం పిండి, నువ్వుల పొడి, బెల్లం కలిపి చేసిన పిండి వంటను గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు.

రెండవ రోజు – అటుకుల బతుకమ్మ
రెండో రోజున పూలతో చిన్న బతుకమ్మను పేర్చి పూజిస్తారు. ఈ రోజున అమ్మవారికి అటుకులు, నానబెట్టిన పప్పు, బెల్లం కలిపి తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తారు.

మూడవ రోజు – ముద్దపప్పు బతుకమ్మ
మూడో రోజున చామంతి, తంగేడు పూలను ఎక్కువగా ఉపయోగిస్తారు. ముద్దపప్పు, బెల్లం, పాలు కలిపి అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తారు.

నాల్గవ రోజు – నానబెట్టిన బతుకమ్మ
నాలుగో రోజు బతుకమ్మను ఎంతో భక్తితో అలంకరిస్తారు. ఈ రోజున నానబెట్టిన బియ్యంలో బెల్లం లేదా పాలు కలిపి నైవేద్యంగా పెడతారు.

ఐదవ రోజు – అట్ల బతుకమ్మ
ఐదో రోజు పూలతో అందంగా తయారు చేసిన బతుకమ్మకు ప్రత్యేకంగా బియ్యం పిండితో చేసిన అట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఆరవ రోజు – అలిగిన బతుకమ్మ
పురాణాల ప్రకారం ఈ రోజు గౌరమ్మ అలిగిందని నమ్ముతారు. అందుకే ఈ రోజున ఇళ్లలో బతుకమ్మను పేర్చరు, పేరంటం కూడా చేయరు. ఈ రోజు ఎలాంటి ప్రత్యేక ప్రసాదం ఉండదు.

ఏడవ రోజు – వేపకాయల బతుకమ్మ
ఏడో రోజున బియ్యం పిండిని బాగా వేయించి, చిన్న చిన్న వేపకాయల ఆకారంలో ఉండలుగా చేసి నైవేద్యంగా పెడతారు.

ఎనిమిదవ రోజు – వెన్నముద్దల బతుకమ్మ
ఎనిమిదో రోజు బతుకమ్మ పూజలో వెన్నముద్దలు ప్రధానమైనవి. నువ్వులు, బెల్లం, వెన్న లేదా నెయ్యి కలిపి చేసిన ప్రసాదాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు.

తొమ్మిదవ రోజు – సద్దుల బతుకమ్మ
ఇది పండుగలోనే పెద్దది. వేడుకగా జరుపుకునే ఆఖరి రోజు. ఈ రోజున ఇంట్లో ఉన్న ఆడపడుచులంతా కలసి పెద్ద ఎత్తున బతుకమ్మను తయారు చేస్తారు. పెరుగు అన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వుల అన్నం వంటి ఐదు రకాల సద్దులు చేసి గౌరమ్మకు నైవేద్యంగా పెడతారు.

Also Read : అనంతగిరి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తాపడిన బస్సు.. 54 మంది స్పాట్‌లో?