పాకిస్తాన్‌లో రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అహ్మద్ షా తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు పాకిస్తాన్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసేలా ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నాలుగు ప్రధాన ప్రావిన్సులను రద్దు చేసి.. ఆ దేశాన్ని 12 నుంచి 15 కొత్త ప్రావిన్సులుగా లేదా ఏకంగా 160 చిన్న పాలనా విభాగాలుగా విభజించేందుకు ఆర్మీ భావిస్తోంది. అయితే దీనికి ముఖ్య కారణం పరిపాలనను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడం, ప్రభుత్వ సేవలను వేగంగా అందించడమే ఈ పునర్వ్యవస్థీకరణ ఉద్దేశమని అధికారికంగా చెబుతోంది. కానీ దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

Also Read : ఎన్నికల వేళ ఇండియన్స్‌కు ట్రంప్ బిగ్ షాక్.. వారి ఓట్లే టార్గెట్.. ఎందుకు?

పాకిస్తాన్‌లో పంజాబ్, సింధ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్ అనే నాలుగు పెద్ద ప్రావిన్సులు ఉన్నాయి. ఈ పెద్ద ప్రాంతాల్లో పట్టున్న రాజకీయ నాయకులు, ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి, సైన్యానికి పెద్ద సవాలుగా మారుతున్నారు. దేశాన్ని చిన్న చిన్న ముక్కలుగా విభజిస్తే ప్రాంతీయ పార్టీల ఎన్నికల బలం తగ్గిపోతుంది. చిన్న యూనిట్లు ఆర్థికంగా, పాలనాపరంగా పూర్తిగా కేంద్రం, సైన్యంపైనే ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల దేశంలో ఆర్మీ పట్టు మరింత పెరుగుతుందని భావిస్తోంది. అయితే పాకిస్తాన్‌లో పంజాబ్ అత్యధిక జనాభా అనగా సుమారు 12.8 కోట్లు ఉన్న ప్రాంతం. ఇక్కడ నవాజ్ షరీఫ్‌కు చెందిన PML-N పార్టీకి బలమైన పునాది ఉంది. మరోవైపు సింధ్ ప్రాంతంలో భుట్టో కుటుంబానికి చెందిన PPP పార్టీ ప్రాబల్యం ఎక్కువ ఉంది.

ఈ రెండు పెద్ద ప్రావిన్సులను విడదీస్తే ఆయా పార్టీల రాజకీయాలు ప్రమాదంలో పడతాయి. అయితే ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతంలో ప్రస్తుతం జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ PTIకి ఇక్కడ తిరుగులేని ఆధిపత్యం ఉంది. ఇప్పటికే ఈ పార్టీతో ప్రభుత్వానికి తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు సరిహద్దులు మార్చడానికి ప్రయత్నిస్తే రాజకీయ అశాంతి ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇక విస్తీర్ణంలో అతిపెద్దదైన బలూచిస్థాన్‌లో జనాభా కేవలం 1.5 కోట్లు మాత్రమే. అక్కడ ఇప్పటికే వేర్పాటువాద ఉద్యమాలు, సహజ వనరుల దోపిడీపై తీవ్ర నిరసనలు సాగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని విభజించాలని చూస్తే తప్పకుండా అక్కడ ఉంటున్న ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

అయితే పాకిస్తాన్ మ్యాప్‌పై కొత్తగా ప్రాంతాలు విభజించడం అంత ఈజీ కాదు. రాజ్యాంగాన్ని సవరించడం, రాజకీయ పార్టీల ఆమోదం పొందడం, స్థానిక ప్రజల నుంచి వచ్చే నిరసనలను తట్టుకోవడం సైన్యానికి పెద్ద సవాలుగా మారనుంది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో కూడా నిత్యావసరాల ధరలు, పన్నులపై ఇప్పటికే తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. ఈ సమయంలోనూ ఆసిమ్ మునీర్ పాకిస్తాన్‌ను ప్రావిన్సులుగా విభజిస్తారా? లేదా? అనేది చూడాలి.

Also Read : భారతీయ టెకీలకు ట్రంప్ షాక్.. పర్మ్ నిలిపివేతతో గ్రీన్ కార్డ్ ఇక కష్టమేనా?