Ranabaali Trailer :  విజయ్ దేవరకొండను ఫుల్ మాస్ అవతార్‌లో చూడాలనుకునే అభిమానులకు రణబలి ట్రైలర్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరిత్ర, ఎమోషన్, యాక్షన్ అన్నీ కలిసిపోయాయి. బ్రిటిష్ పాలన కాలం నాటి కథతో సినిమా సాగనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

కరువు, పేదరికం, బ్రిటిష్ అధికారుల దోపిడీతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూపిస్తూ ట్రైలర్ మొదలవుతుంది. తమ కళ్ల ముందే ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా చూస్తూ ఊరుకోలేని వ్యక్తిగా విజయ్ దేవరకొండ పాత్రను పరిచయం చేశారు. ఆ తర్వాత సింగనమల బొబ్బిలి రణబలి పాత్రలో విజయ్ ఎంట్రీ ఇస్తాడు. అక్కడి నుంచి ట్రైలర్‌లో మాస్ యాక్షన్ మొదలవుతుంది.

రణబలి పాత్రలో విజయ్ దేవరకొండ లుక్ పూర్తిగా కొత్తగా కనిపిస్తోంది. కండలు తిరిగిన బాడీ, రఫ్ లుక్, కోపం, దూకుడు.. ఇలా పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్నాడు. ముఖ్యంగా రాయలసీమ యాసలో విజయ్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అతని బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.

ట్రైలర్‌లో యాక్షన్ సీన్స్ కూడా చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. బ్రిటిష్ సైనికులతో రణబలి చేసే పోరాటాలు చాలా రఫ్‌గా, సహజంగా చూపించారు. కేవలం ఫైట్స్ కోసమే యాక్షన్ పెట్టకుండా.. బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలతో యాక్షన్‌ను లింక్ చేశారు. ప్రజలపై జరుగుతున్న దోపిడీ, ఆకలి, అన్యాయాన్ని చూసి రణబలి తిరగబడేలా కథను చూపించారు.

హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా తన విలన్ పాత్రతో ఆకట్టుకున్నాడు. రష్మిక మందన్న పాత్రకు సంబంధించిన ఎమోషనల్ సన్నివేశాలు కూడా ట్రైలర్‌లో కనిపించాయి. విజయ్ పాత్రలోని కోపం, రష్మిక పాత్రలోని ఎమోషన్ సినిమాకు మరింత బలం ఇచ్చేలా ఉన్నాయి. టెక్నికల్‌గా కూడా రణబలి భారీ స్థాయిలో కనిపిస్తోంది. అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్లకు మరింత ఊపు తీసుకొచ్చింది. జిష్ణు భట్టాచార్జీ, నీరవ్ షా కెమెరా పనితనం బ్రిటిష్ కాలం నాటి ప్రపంచాన్ని భారీగా చూపించింది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను టీ-సిరీస్ సమర్పిస్తోంది. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. విజయ్ దేవరకొండ మాస్ అవతార్‌కు రాహుల్ సంకృత్యాన్ విజన్ తోడవడంతో రణబలిపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ మూవీ అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.