
APSRTC : దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ ప్రత్యేక సర్వీసులు అక్టోబర్ 16 నుంచి 25 వరకు అందుబాటులో ఉంటాయి. పండుగకు ముందు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం అక్టోబర్ 16 నుంచి 19 వరకు 3,207 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. దసరా ముగిసిన తర్వాత తిరిగి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లే వారి కోసం అక్టోబర్ 20 నుంచి 25 వరకు మరో 2,054 బస్సులు ఏర్పాటు చేశారు.
ఈ ప్రత్యేక బస్సుల్లో హైదరాబాద్ నుంచి 1,186 సర్వీసులు, విజయవాడకు 1,053, బెంగళూరుకు 475, విశాఖపట్నానికి 440, రాజమహేంద్రవరానికి 347, తిరుపతికి 247, చెన్నైకి 153 బస్సులు నడపనున్నారు. ఇతర ప్రాంతాలకు మరో 1,360 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులకు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ దసరా ప్రత్యేక బస్సుల్లో కూడా సాధారణ బస్సుల ఛార్జీలనే వసూలు చేయనున్నారు. అంటే స్పెషల్ సర్వీస్ పేరుతో అదనపు ఛార్జీలు ఉండవు.
ఈ ఏడాది దసరా ఉత్సవాలు అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 16న మూలా నక్షత్రం, 18న దుర్గాష్టమి, 19న మహర్నవమి, 20న విజయదశమి జరగనున్నాయి. దీంతో పండుగకు ముందు, తర్వాత బస్సులకు భారీ రద్దీ ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ ఈ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్, ఆన్లైన్ బుకింగ్ సదుపాయం ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చు. బస్సుల టైమింగ్స్, సర్వీసుల వివరాలను కూడా ఆర్టీసీ వెబ్సైట్లో చూడొచ్చు. ఏపీఎస్ఆర్టీసీ కస్టమర్ కేర్ కోసం 149 నంబర్‌ను కూడా అందుబాటులో ఉంచింది.
మరోవైపు టీజీఎస్ఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సులు నడపనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 9, 10, 16, 17 తేదీల్లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ఆ రోజుల్లో అదనపు బస్సులు నడపనున్నారు. దసరా తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చే ప్రయాణికుల కోసం అక్టోబర్ 25, 26 తేదీల్లో కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి.









