
Cancer drug prices : క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ధరల నియంత్రణలో లేని క్యాన్సర్ మందులపై కంపెనీలు, మందుల విక్రేతలు ఎక్కువ లాభం పెట్టకుండా కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను 30 శాతానికి పరిమితం చేసింది. దీంతో కొన్ని క్యాన్సర్ మందుల ధరలు ఏకంగా 70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది. ఈ నిర్ణయంతో రోగులకు ఏడాదికి దాదాపు రూ.2,500 కోట్ల వరకు ఆదా కావచ్చని అంచనా వేసింది.
ఈ కొత్త నిబంధన బ్రాండెడ్, జనరిక్ మందులకు వర్తిస్తుంది. దేశంలో తయారయ్యే మందులతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే మందులు కూడా ఇందులో ఉంటాయి. పేటెంట్ ఉన్నా, లేకపోయినా.. ధరల నియంత్రణలో లేని క్యాన్సర్ మందులన్నింటికీ ఈ నిబంధన వర్తించనుంది.
మందులపై కొందరు ఎక్కువ లాభం పెట్టడం వల్ల రోగులు భారీ ధరలు చెల్లించాల్సి వస్తోంది. దీన్ని తగ్గించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే కీలక మందులు రోగులకు తక్కువ ధరలో అందేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
కాగా క్యాన్సర్ మందుల ధరలపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. సెప్టెంబర్ 29న జరిగిన విచారణలో ఒక క్యాన్సర్ మందు ఉదాహరణను కోర్టు ప్రస్తావించింది. రిటైలర్‌కు ఆ మందు సుమారు రూ.2,700కే వస్తుండగా.. రోగికి మాత్రం రూ.27,000కు అమ్ముతున్నారని కోర్టు దృష్టికి వచ్చింది. అంటే మందు ధరకు, MRPకి మధ్య దాదాపు పది రెట్ల తేడా ఉంది.
మందులపై ఒకే రకమైన లాభ పరిమితి ఎందుకు పెట్టకూడదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ధరల నియంత్రణలో ఉన్న మందులకు ఉన్నట్లుగా 16 శాతం మార్జిన్ పెట్టే విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. అయితే దేశవ్యాప్తంగా 16 శాతం మార్జిన్ పెట్టాలని కోర్టు ఆదేశించలేదు. ఈ కేసుపై అక్టోబర్ 12న మరోసారి విచారణ జరగనుంది.
కార్పొరేట్ ఆసుపత్రుల్లోని ఫార్మసీల నుంచే మందులు కొనాలని రోగులపై ఒత్తిడి వస్తున్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందుతున్న వారికి ఇలాంటి పరిస్థితి ఎందుకు రావాలన్న అంశంపై కోర్టు ప్రశ్నలు వేసింది. క్యాన్సర్ చికిత్స ఖర్చులు తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మరికొన్ని చర్యలు తీసుకుంటోంది. 2026 మార్చి నాటికి 131 క్యాన్సర్ మందులకు గరిష్ఠ ధరలను నిర్ణయించింది.









