Virat Kohli : వృందావన్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి వెళ్లేందుకు విరాట్ కోహ్లీకి రూ.5 కోట్లు ఇచ్చారంటూ వచ్చిన వార్తలను కోహ్లీ టీమ్ ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

ప్రేమానంద్ మహారాజ్‌కు చెందిన రాధా కేలీ కుంజ్ ఆశ్రమంలో ఓ శిష్యుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన తర్వాత వివాదం మొదలైంది. ఈ క్రమంలో శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ అధ్యక్షుడు ఫలహారి మహారాజ్ దినేశ్ శర్మ సంచలన ఆరోపణలు చేశారు. ప్రేమానంద్ మహారాజ్‌కు పాపులారిటీ పెంచేందుకు విరాట్ కోహ్లీని ఆశ్రమానికి తీసుకురావడానికి రూ.5 కోట్లు చెల్లించారని ఆయన ఆరోపించారు.

Also Read : ఎయిర్‌టెల్ కస్టమర్లకు బిగ్ షాక్.. రేపటి నుంచి కొత్త రేట్లు

ఈ ఆరోపణలపై కోహ్లీ టీమ్ స్పందిస్తూ.. విరాట్ కోహ్లీ గురించి ఫలహారి మహారాజ్ దినేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం. వాటిలో ఎలాంటి నిజం లేదు. ఆ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నాం అని తెలిపింది. విరాట్ కోహ్లీకి ప్రేమానంద్ మహారాజ్‌పై ఎంతో నమ్మకం, గౌరవం ఉంది. ఆ భక్తితోనే ఆయనను కలవడానికి ఆశ్రమానికి వెళ్తున్నారు. ఇలాంటి ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా వార్త ప్రచురించే ముందు మీడియా నిజానిజాలు తెలుసుకుని, బాధ్యతగా వార్తలు ఇవ్వాలి అని కోహ్లీ టీమ్ చెప్పింది.

అయితే విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ ఆశ్రమానికి వెళ్లేందుకు ఎలాంటి డబ్బులు తీసుకున్నారనే దానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు బయటపడలేదు. కాగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు రాధా కేలీ కుంజ్ ఆశ్రమానికి తరచూ వెళ్తుంటారు. 2023 జనవరి 4న వీరిద్దరూ తొలిసారి అక్కడికి వెళ్లారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ప్రేమానంద్ మహారాజ్‌ను కలిశారు. కోహ్లీ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత కూడా ఆశ్రమానికి వారి రాకపోకలు కొనసాగుతున్నాయి.

ఇక ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమంలో ఆయన శిష్యుడు రసిక్ దులారీ మృతి చెందడంతో ఆశ్రమం వ్యవహారాలపై ఇప్పుడు పోలీసుల దృష్టి పడింది. సెప్టెంబర్ 25న ఆశ్రమంలోని నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో రసిక్ దులారీ మృతి చెందాడు.

Also Read : IAFకు కొత్త బాస్‌.. ఆశుతోష్‌ దీక్షిత్‌కు కీలక బాధ్యతలు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.