
Andhra Pradesh : ఏపీలో పాకిస్థాన్ స్పై నెట్‌వర్క్‌పై కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఫైర్‌వాల్–2026 పేరుతో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. మొత్తం 18 మందితో సంబంధం ఉన్న ఈ స్పై నెట్‌వర్క్‌లో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించినట్లు సమాచారం. 12 కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఏపీతో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా 10 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో కొందరు నేరుగా టచ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్క్రిప్టెడ్ ఛానళ్ల ద్వారా కీలక సమాచారాన్ని పాక్ ఆపరేటివ్‌లకు చేరవేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విశాఖలోని నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన సమాచారమే ఈ గూఢచర్యంలో టార్గెట్‌గా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సున్నితమైన, రహస్య సమాచారాన్ని సేకరించి పాకిస్థాన్‌కు చేరవేసినట్లు అనుమానాలు ఉన్నాయి. అనుమానితుల నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : ఏపీ బీజేపీ నేత బైక్‌కు నిప్పు.. భర్తను చంపేందుకు భార్య ప్లాన్!
మొత్తం 18 మంది అనుమానితుల్లో ఇద్దరి పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించినట్లు సమాచారం. వీరిలో విశాఖకు చెందిన సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్ అన్నం సాయి వరప్రసాద్‌ను ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నేవీ, రక్షణ సంస్థలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్ ఆపరేటివ్‌కు చేరవేసినట్లు సాయి వరప్రసాద్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారం ఇచ్చినందుకు డబ్బులు తీసుకున్నారా? అనే కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సాయి వరప్రసాద్‌కు అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆయనను విశాఖ జిల్లా జైలుకు తరలించారు.
ఇదే కేసులో కోయంబత్తూరులో మరో నేవీ ఉద్యోగిని కూడా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రదీప్ ముఖర్జీని అదుపులోకి తీసుకున్నారు. పాక్ ఆపరేటివ్‌కు వాట్సాప్ యాక్టివేట్ చేసేందుకు అవసరమైన OTPని ప్రదీప్ ముఖర్జీ షేర్ చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో కమ్యూనికేషన్, వారికి కీలక సమాచారం చేరవేశారా? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని ప్రదీప్ ముఖర్జీని కోయంబత్తూరు నుంచి విజయవాడకు తరలించారు. ఆయనకు కూడా అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ప్రదీప్ ముఖర్జీ ఉన్నారు.
మిగిలిన 16 మంది అనుమానితులపై కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు కొనసాగుతోంది. వీరికి పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఎలాంటి సమాచారం చేరవేశారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన కేసు కావడంతో దర్యాప్తుకు సంబంధించిన మరిన్ని వివరాలను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రస్తుతానికి వెల్లడించడం లేదు.
Also Read : ఏపీలో ఇరుముడి సినిమా రిపీట్.. అక్కడ టీచర్.. ఇక్కడ వంట మనిషి!









