kavitha : రాష్ట్రంలో తక్షణమే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. రైతులకు సాగునీటి కోసం రోజుకు ఆరు నుంచి ఏడు గంటలకు మించి విద్యుత్‌ సరఫరా కావడం లేదన్నారు. ప్రభుత్వం కరెంట్‌ కోతలు లేవని చెబితే సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వచ్చి పరిస్థితిని స్వయంగా చూపిస్తానని కవిత ఈ సందర్భంగా సవాల్‌ చేశారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ ఆఫీసులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులతో కరువు తాండవిస్తోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు దాదాపు 20 అడుగుల మేర పడిపోయాయని, దీంతో బోర్లు ఎండిపోతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఏం చేసైనా రైతులకు ఉచితంగా, నిరంతర నాణ్యమైన విద్యుత్‌ అందించాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేశారు. కరువు పరిస్థితులు ముందే కనిపిస్తున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం మాత్రం ముందస్తు ప్రణాళిక రూపొందించలేదన్నారు. అయితే తాజాగా రాష్ట్ర కేబినెట్‌ మాత్రం వర్షపాతం లోటుతో 235 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు నెలకొన్నట్లు గుర్తించిందన్నారు. ఈ మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరాలని నిర్ణయించిందని, ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి, రైతు సంఘాలు, నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని కవిత చెప్పుకొచ్చారు.

కరువు మండలాలను ప్రకటిస్తే కేంద్రం నుంచి రైతులకు, రాష్ట్రానికి సాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేయాలి అని కోరారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి లభ్యత ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ప్రాజెక్టులను పూర్తిస్థాయిలో ఎందుకు నింపలేదని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాలమూరు ప్రాంత రైతులకు సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ నీళ్లను సీఎం రేవంత్ రెడ్డి గిఫ్ట్‌ ప్యాక్‌ చేసి ఏపీ సీఎం చంద్రబాబుకు పంపిస్తున్నారని కవిత ఆరోపించారు. కృష్ణా నీళ్లు కుప్పం వెళ్తున్నా.. మహబూబ్‌నగర్‌ రైతులకు మాత్రం నీళ్లు రావడం లేదు అని కవిత విమర్శించారు. హైదరాబాద్‌ సహా పలు పట్టణాల్లోనూ తాగునీటి సమస్యలు తలెత్తే పరిస్థితి ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 60 నియోజకవర్గాల్లో తమ పార్టీ ఇన్‌చార్జ్‌లు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు, ప్రజలకు అండగా ఉంటారని ఈ సందర్భంగాప్రకటించారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.