
Putin : రష్యా ఏ యూరప్ దేశంపైనా దాడి చేయాలని అనుకోవడం లేదని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. అయితే రష్యాలోని కాలినిన్‌గ్రాడ్ లేదా మరే ప్రాంతంపైనైనా నేరుగా దాడి జరిగితే మాత్రం తమ దేశాన్ని కాపాడుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలను ఉపయోగిస్తామని ఆయన హెచ్చరించారు. మాస్కోలో జరిగిన వాల్దాయ్ ఫోరమ్‌లో పుతిన్ ఈ కామెంట్స్ చేశారు. యూరప్‌తో రష్యా శాంతిగా ఉండాలని కోరుకుంటోందని, కానీ రష్యాపై దాడి జరిగితే పరిస్థితి చాలా తీవ్రంగా మారుతుందని అన్నారు.
కాలినిన్‌గ్రాడ్ రష్యాకు పశ్చిమం వైపు ఉన్న ప్రాంతం. ఇది నాటో సభ్య దేశాలైన పోలాండ్, లిథువేనియా మధ్య ఉంది. ఈ ప్రాంతంలో రష్యా పెద్ద ఎత్తున సైన్యాన్ని, ఆయుధాలను ఉంచింది. కాలినిన్‌గ్రాడ్‌ను రష్యాలోని మిగతా ప్రాంతాల నుంచి వేరు చేసే ప్రయత్నం జరిగితే.. దాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను కూడా ఉపయోగించే అవకాశం ఉందని రష్యా గతంలో నాటోను హెచ్చరించింది. ఈ విషయంలో రష్యా, నాటో మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే మాత్రం తమ సైనిక వ్యవస్థ రక్షణ కోసమేనని చెప్పారు. అణ్వాయుధాలతో బెదిరించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు.
2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. రష్యా తమ దేశాల్లో విధ్వంసం, అగ్నిప్రమాదాలు వంటి ఘటనలకు పాల్పడుతూ హైబ్రిడ్ వార్ చేస్తున్నట్లు కొన్ని యూరప్ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే రష్యా ఈ ఆరోపణలను ఖండిస్తోంది. పెరుగుతున్న ఉద్రిక్తతలు ఒక దశకు చేరితే.. ఆ తర్వాత పరిస్థితిని వెనక్కి తిప్పడం చాలా కష్టమవుతుందని పుతిన్ అన్నారు. భారీ విధ్వంసానికి కారణమయ్యే ఆయుధాలను ఉపయోగించే పరిస్థితులు రాకుండా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి మూడు దేశాల సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ చెప్పారు. అయితే ముందుగా ఆ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, అజెండా ఖరారు కావాలని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి కూడా పుతిన్ మాట్లాడారు. నల్ల సముద్రం ప్రాంతంలోని ఉక్రెయిన్ స్థావరాలపై రష్యా దాడులు ఆపబోదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ దాడుల వల్ల రష్యాలోని కొన్ని చమురు రిఫైనరీలు దెబ్బతిన్నాయని పుతిన్ అంగీకరించారు. దీనివల్ల రష్యా జీడీపీకి దాదాపు ఒక శాతం నష్టం జరిగిందని చెప్పారు. అయితే ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న యూరప్‌లోని ఆయుధ తయారీ కర్మాగారాలపై ప్రస్తుతం దాడులు చేసే ఆలోచన తమకు లేదని పుతిన్ తెలిపారు.









