Pahalgam Attack :  జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో లష్కర్‌-ఎ-తయిబా ఉగ్రవాది మహ్మద్ ఆసిఫ్ అలియాస్ హషీం మూసా హతమయ్యాడు. బుద్గాం జిల్లాలోని యూస్‌మార్గ్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు యూస్‌మార్గ్‌లో గాలింపు చేపట్టాయి. అనుమానాస్పద కదలికలను గుర్తించి వారిని లొంగిపోవాలని హెచ్చరించగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో హషీం మూసా హతమయ్యాడు. ఈ ఆపరేషన్‌ను ఆపరేషన్ కోరాగ్ గా నిర్వహించారు. భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ కలిసి ఈ గాలింపు చేపట్టాయి.

ఆ తర్వాత భద్రతా బలగాలు చేపట్టిన గాలింపులో అతడి మృతదేహంతో పాటు భారీగా ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 2025 ఏప్రిల్‌లో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి కేసులో హషీం మూసా పేరు కీలకంగా తెరపైకి వచ్చింది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో హషీం మూసా ఆచూకీ తెలిపిన వారికి జమ్మూకశ్మీర్ పోలీసులు రూ.20 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.

Also Read : ATM నుంచి గ్యాస్ వరకు.. అక్టోబర్‌1 నుంచి కొత్త రూల్స్

పాకిస్థాన్‌కు చెందిన లష్కర్‌-ఎ-తయిబా ఉగ్రవాదిగా భద్రతా సంస్థలు అతడిని గుర్తించాయి. పూంఛ్-రాజౌరీ ప్రాంతంతో పాటు కశ్మీర్ లోయలో జరిగిన పలు దాడులతో అతడికి సంబంధాలు ఉన్నట్లు అధికారులు అనుమానించారు. హషీం మూసా కోసం భద్రతా బలగాలు కొంతకాలంగా గాలిస్తున్నాయి. అతడి సహచరుడు యాసిర్ సెప్టెంబర్ 5న యూస్‌మార్గ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన తర్వాత మూసా కోసం గాలింపు మరింత ముమ్మరమైంది. తాజాగా అందిన సమాచారంతో చేపట్టిన ఆపరేషన్‌లో మూసా ఆచూకీ లభించడంతో ఎన్‌కౌంటర్ జరిగింది. అనంతరం అడవుల్లో కొనసాగించిన గాలింపులో అతడి మృతదేహాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి.

Also Read : IAS ఉద్యోగానికి గుడ్‌బై.. రాజకీయాల్లోకి దివ్య మిట్టల్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.