
Jaishankar : న్యూయార్క్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఉగ్రవాదానికి సంబంధించిన ప్రశ్న అడిగేందుకు ఆ జర్నలిస్టు ప్రయత్నించగా.. జైశంకర్ గట్టిగా స్పందించారు. ఉగ్రవాద దేశం నన్నే ఈ ప్రశ్న అడుగుతోంది అని అన్నారు. ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం జైశంకర్ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. అక్కడ లైబీరియా విదేశాంగ మంత్రి సారా బేసోలో న్యాంటితో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నౌకలు, వాటిలో పనిచేసే సిబ్బంది భద్రతపై ఈ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ముందుగా జర్నలిస్టుల నుంచి ప్రశ్నలు తీసుకోబోమని ప్రకటించారు. అయితే సమావేశం చివర్లో పాకిస్థాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు మధ్యలో మాట్లాడి ఉగ్రవాదంపై ప్రశ్న అడిగేందుకు ప్రయత్నించారు. దీంతో జైశంకర్ వెంటనే స్పందించారు. పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా పేర్కొంటూ ఆయన సమాధానం ఇచ్చారు. ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రతినిధి బృందంతో కలిసి జైశంకర్ న్యూయార్క్‌కు వెళ్లారు. శనివారం జరిగే కీలక సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. ఇప్పటికే పలుదేశాల నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించారు.
పాకిస్థాన్ నుంచి కొన్ని ఉగ్రవాద సంస్థలకు సహాయం అందుతోందని భారత్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. సరిహద్దు దాటి జరిగే ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు పాకిస్థాన్ కఠినమైన చర్యలు తీసుకోవాలని భారత్ కోరుతోంది. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు చనిపోయారు. ఈ దాడికి ప్రతిస్పందనగా భారత్ తనను తాను రక్షించుకునే హక్కులో భాగంగా సైనిక చర్య చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఉగ్రవాద సంస్థలు, వాటి స్థావరాలే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. పహల్గామ్ దాడిని అంతర్జాతీయంగా కూడా పలు దేశాలు ఖండించాయని భారత్ చెబుతోంది.









