
Abhijeet Dipke : ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని భావిస్తే.. ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయడం మానేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు. ఎన్నికలు సరిగా జరగడం లేదని చెబుతూ.. మళ్లీ అదే ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఆ ఎన్నికలు సరిగానే జరుగుతున్నాయనే భావనకు బలం ఇస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని చెబుతున్నారు. మరి అలాంటి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారు? అని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయకపోతే తమ రాజకీయ ఉనికి పోతుందనే భయంతోనే ప్రతిపక్షాలు ఎన్నికల్లో కొనసాగుతున్నాయా అని అడిగారు. ఓట్లు దొంగిలిస్తున్నారని, ఎమ్మెల్యేలు, ఎంపీలను తమ వైపు తిప్పుకుంటున్నారని, పార్టీలను చీల్చుతున్నారని ఆరోపణలు చేస్తూనే ఎన్నికల్లో పోటీ చేయడం ఎంతకాలం కొనసాగుతుందని దీప్కే ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా మనుగడ సాగించడం కష్టమని అన్నారు.
Also Read : క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్.. కొత్త AI టూల్స్
ఎన్నికల్లో అక్రమాలపై ప్రతిపక్షాలు కూడా ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడకూడదని దీప్కే అన్నారు. తమకు ఇబ్బంది కలిగిన రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నికలపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదన్నారు. ఏ రాష్ట్రంలో, ఏ పార్టీకి సంబంధించిన ఎన్నికలైనా.. అక్రమాలు జరిగాయని భావిస్తే ఒకే విధంగా స్పందించాలని చెప్పారు. ఎన్నికలను దీప్కే ఫిక్స్డ్ క్రికెట్ మ్యాచ్‌తో పోల్చారు. మ్యాచ్ ముందే ఫిక్స్ అయినా.. చివరి ఓవర్ వరకు పోటీ ఉన్నట్లు కనిపించవచ్చని అన్నారు. అదే విధంగా ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలకు కొన్ని సీట్లు గెలిచే అవకాశం ఇచ్చి.. ఎన్నికలు నిజంగానే పోటీగా జరిగాయనే భావన కలిగించవచ్చని చెప్పారు. దేశం, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించి ప్రతిపక్షాలు నిర్ణయం తీసుకోవాలని దీప్కే సూచించారు. ఎన్నికల్లో నిజంగానే అక్రమాలు జరుగుతున్నాయని నమ్మితే.. వాటిలో పాల్గొనకుండా నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని దీప్కే ఒక రోజు ముందు డిమాండ్ చేశారు. తన డిమాండ్ నెరవేరకపోతే ‘జంతర్ మంతర్ 2.0’ పేరుతో ఆందోళన చేపడతామని ప్రకటించారు. మరోవైపు.. ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో 14 సార్లు కొన్ని నిర్ణయాలపై అభ్యంతరం చెప్పినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఒక కథనంలో పేర్కొంది. ఓటర్ల పేర్లను చేర్చడం, తొలగించడం, తిరిగి చేర్చడం, ఓటరు నమోదు విధానంలో మార్పులు వంటి అంశాలపై వారు అభ్యంతరాలు చెప్పినట్లు తెలిపింది. అయితే ఈ వార్తలను ఎన్నికల సంఘం ఖండించింది. SIRతో పాటు అన్ని నిర్ణయాలు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల అంగీకారంతోనే ఏకగ్రీవంగా తీసుకున్నామని ఈసీ స్పష్టం చేసింది.
Also Read : జనాభా తగ్గుతోందట.. గుజరాత్లో కొత్త పథకం.. మూడో బిడ్డ పుడితే రూ.50 వేలు!









