Gujarat : జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న గుజరాత్‌లోని కచ్‌ కడ్వా పటేల్‌ సమాజ్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ సామాజిక వర్గానికి చెందిన దంపతులకు మూడో సంతానం కలిగితే రూ.50 వేల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అందించాలని నిర్ణయించింది. మూడో బిడ్డ తల్లిదండ్రులను బహిరంగ కార్యక్రమంలో సన్మానించనున్నారు.

యువ దంపతుల్లో చాలామంది ఒక్క బిడ్డతోనే కుటుంబాన్ని పరిమితం చేస్తున్నారని, కొందరు అసలు పిల్లలను కనడం లేదని కమ్యూనిటీ నాయకులు తెలిపారు. జనాభా తగ్గుదలతో పాటు కులం, మతం, వయసుల పరంగా జనాభా సమతుల్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఎక్కువ మంది పిల్లలను కనాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు.

Also Read : విద్యార్థులకు ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ బంపర్‌ ఆఫర్‌!

గుజరాత్‌లో KKPS జనాభా సుమారు 17 వేలుగా ఉందని, అది క్రమంగా తగ్గుతోందని కమ్యూనిటీ ప్రతినిధులు తెలిపారు. యువతలో సంతానం పట్ల ఆసక్తి తగ్గడం, వృద్ధుల సంఖ్య పెరుగుతుండటం వంటి అంశాలు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. KKPS దక్షిణ గుజరాత్‌ ఉపాధ్యక్షుడు జవేరీలాల్‌ రమణి మాట్లాడుతూ.. మూడో సంతానం పొందే దంపతులను ప్రోత్సహించడమే ఎఫ్‌డీ పథకం ఉద్దేశమన్నారు. వారికి ఆర్థిక ప్రోత్సాహంతో పాటు బహిరంగ కార్యక్రమంలో సన్మానం కూడా ఉంటుందని తెలిపారు.

మూడో సంతానాన్ని ప్రోత్సహించేందుకు పార్సీ సమాజంలోనూ ఇలాంటి పథకం అమల్లో ఉంది. వివాహిత దంపతులు మూడో బిడ్డను కనేందుకు ప్రోత్సహిస్తూ నెలకు రూ.5 వేల చొప్పున, ఆ బిడ్డకు 25 ఏళ్లు వచ్చే వరకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 39 మంది దంపతులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నట్లు సూరత్‌ పార్సీ పంచాయత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ హోమీ దూధ్‌వాలా తెలిపారు.

Also Read : NEET PG ఫలితాలు విడుదల!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.