
Sharjah Murder : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గత జూన్‌లో జరిగినట్లు అనుమానిస్తున్న ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. కర్ణాటకలోని ఉడుపి జిల్లాకు చెందిన అల్విన్ ప్రకాశ్ కుందర్.. ఆయన భార్య టీనా, తన కుమారుడితో కలిసి యూఏఈ (UAE) లో నివసిస్తున్నారు. ప్రకాశ్ గత 14 ఏళ్లుగా షార్జా ఎయిర్‌పోర్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య టీనా స్థానికంగా ఒక పాఠాశాల ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. ఈ దంపతుల కుమారుడు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. అయితే ఈ ఏడాది జూన్‌లో ప్రకాశ్ కుందర్ హత్యకు గురయ్యారని తెలుస్తోంది. అంతేకాదు, ఆయనను ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై ఆయన సోదరుడు మాట్లాడుతూ తన సోదరుడిని దారుణంగా చంపి, మృతదేహాన్ని 9 ముక్కలుగా చేశారని ఆల్విన్ ప్రకాశ్ సోదరుడు అనిల్ ప్రశాంత్ వెల్లడించారు. అలాగే ప్రకాశ్ హత్య తరువాత ఆయన భార్య, కుమారుడు కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : బీహార్ ఘటన మరువక ముందే.. ఒడిశాలో దారుణం : VIDEO VIRAL
ఆయన తెలిపిన వివరాల ప్రకారం..జులై 20న తన సోదరుడు ప్రకాశ్‌తో ఫోన్ మాట్లాడాలని ప్రయత్నించానని, కానీ, కాల్ ఎవరు రిసీవ్ చేయలేదన్నారు. అయితే..అంతా ఓకే అంటూ ఒక టెక్ట్స్ మెసేజ్ పంపాడని వివరించారు. మామూలుగా అల్విన్ ఎప్పుడు తనకు వాయిస్ మెసేజ్ చేస్తాడని, అలాంటిది ఈసారి మాత్రం భిన్నంగా సమాచారం ఇచ్చాడని తెలిపారు. మళ్లీ వారం తర్వాత ఫోన్ చేసినా స్పందన రాలేదన్నాడు. అనుమానం వచ్చిన అనిల్ షార్జాలోనే ఉండే తన స్నేహితుడికి కాల్ చేసి విషయం వివరించారు. ఆ స్నేహితుడు ఆల్విన్ ప్రకాశ్ ఉండే ఫ్లాట్‌కు వెళ్లి చూడగా..ఆ ఫ్లాట్ ఖాళీగా కనిపించింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న వాచ్‌మన్‌ను ఆరా తీయగా ఆల్విన్ ప్రకాశ్ భారత్‌కు వెళ్లిపోయారని తెలిసింది.
మరింత అనుమానంతో కంపెనీ నుంచి సమాచారం కోరగా అక్కడి నుంచి అదే సమాధానం వచ్చింది. అయితే ప్రకాశ్ భారత్‌కు రాలేదని, ఎక్కడున్నాడో వెతకాలని కోరినట్లు తెలిపారు. పాస్‌పోర్ట్ వివరాలను బట్టి అతడు ఇంకా షార్జాలోనే ఉన్నాడని అర్థమైంది. దాంతో మిస్సింగ్ కేసుగా ఫిర్యాదు చేశాం.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. ఒమన్‌కు వెళ్లే మార్గంవైపు పార్క్ చేసి ఉంచిన కారులో ప్రకాశ్ శరీర భాగాలు దొరికాయి.ప్రకాశ్ శరీరాన్ని తొమ్మిది భాగాలుగా చేసి, రెండు సంచుల్లో ఉంచారు’’ అని అనిల్ వెల్లడించారు. అయితే ఆయన భార్యా కుమారుడి ఆచూకీ మాత్రం తెలియలేదు. వారి గురించి ఆరా తీస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. హత్యలో టీనా ప్రమేయంపైనా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు అల్విన్, టీనా మధ్య గొడవలున్నట్లు తమకు తెలియదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా, ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆల్విన్ భార్య, కుమారుడి ఆచూకీ కోసం కూడా గాలిస్తున్నారు.
Also Read : హైదరాబాద్ – ఖమ్మం నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం.. కారులో డాక్టర్ సజీవదహనం









