ఈ రోజుల్లో ప్రపంచాన్ని ఏలేది టెక్నాలజీయే. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఎవరు ముందంజలో ఉంటే వాళ్లే ప్రపంచానికి బాస్ అవుతారు. ఈ విషయం బాగా తెలిసిన అమెరికా, చైనాలు ఏఐ రేసులో ఒకరినొకరు దాటుకుని ముందుకు వెళ్లడానికి పోటీ పడుతున్నాయి. ఏ క్షణంలోనైనా చైనా మన కంటే ముందుకు వెళ్లిపోతుందేమో అనే భయం అమెరికాను వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఏఐ రంగంలో చైనా చేతిలో అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదని, దానికోసం ప్రత్యేకంగా ఒక ఏఐ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

గతంలో తన మొదటి పదవీకాలంలో అమెరికా సైన్యంలో స్పేస్ ఫోర్స్ అనే ప్రత్యేక విభాగాన్ని తెచ్చినట్టే ఇప్పుడు ఈ ఏఐ ఫోర్స్‌ను కూడా తీసుకురాబోతున్నారు. అంతేకాదు ఈ రంగాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించి ముందుకు నడిపించడానికి త్వరలోనే ఒక ‘ఏఐ జార్’ ను కూడా నియమిస్తామని తెలిపారు. ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ విషయాలను వెల్లడించారు. అయితే ఈ ఏఐ ఫోర్స్ అసలు ఏం చేస్తుంది? దీనికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు? ఇది మిలిటరీ కింద పనిచేస్తుందా లేక మామూలు సివిల్ సంస్థలా ఉంటుందా? అనే విషయాలపై ట్రంప్ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. కానీ, భవిష్యత్తులో టెక్నాలజీ ప్రపంచంలో అమెరికా ఆధిపత్యం తగ్గకుండా ఉండేందుకు ఇది ఒక ప్రధాన ఆయుధంగా పనిచేస్తుందని మాత్రం తెలుస్తోంది.

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ వేగంగా పెరిగిపోతుండటంతో దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదాలు తప్పవని వెంటనే కఠినమైన ఆంక్షలు విధించాలని ప్రపంచవ్యాప్తంగా చాలామంది నిపుణులు భయపడుతున్నారు. కానీ ట్రంప్ మాత్రం ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చారు. తమ ప్రభుత్వం ఏఐ అభివృద్ధిని అడ్డుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ పరిశ్రమ మరింతగా ఎదిగేలా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఒకవేళ ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎవరైనా నేరాలు చేస్తే వాటిని ఎదుర్కోవడానికి ఇప్పటికే ఉన్న చట్టాలు సరిపోతాయని, కొత్తగా కఠినమైన నిబంధనలు పెట్టి ఏఐ కంపెనీల స్వేచ్ఛను హరించబోమని స్పష్టం చేశారు.

ట్రంప్ అభిప్రాయం ప్రకారం.. ఏఐ అనేది రాబోయే రోజుల్లో అతిపెద్ద పారిశ్రామిక విప్లవం కాబోతోంది. ఇది గతంలో వచ్చిన ఇంటర్నెట్ విప్లవం కంటే కూడా చాలా రెట్లు పెద్దదిగా మారనుంది. భవిష్యత్తులో అమెరికా మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఏఐ వాటా ఏకంగా 25 శాతం వరకు ఉంటుందని ఆయన అంచనా వేస్తున్నారు. ఏఐ వల్ల ప్రపంచం వినాశనం అయిపోతుందంటూ డెమోక్రాట్లు, కొందరు నిపుణులు చేస్తున్న ప్రచారాలన్నీ కేవలం బూటకమని, గ్లోబల్ వార్మింగ్ లాగానే ఇది కూడా ఒక కల్పిత భయమని కొట్టిపారేశారు.

అయితే అమెరికా అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే కూడా ఇటీవల మాట్లాడుతూ.. “ఏఐ పోటీలో మనం చైనా చేతిలో ఓడిపోకూడదు, ఇది అందరూ ఒప్పుకోవాల్సిన పచ్చి నిజం” అని వ్యాఖ్యానించారు. చైనా కూడా ఏఐ రంకరంలో అత్యంత వేగంగా దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో అమెరికన్ కంపెనీలపై ఆంక్షలు విధిస్తే.. చైనా సులభంగా అమెరికాను దాటేస్తుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మన కంపెనీలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, చైనాకు చెక్ పెట్టడమే ఏఐ ఫోర్స్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే ఈ కొత్త ఏఐ ఫోర్స్‌కు ఎలాంటి అధికారాలు ఉంటాయి, ఏఐ జార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.