ఆఫ్రికన్ దేశమైన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుకావు నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో హఠాత్తుగా చెలరేగిన అగ్నిప్రమాదం కారణంగా భారీ ప్రమాదం ఏర్పడింది. నిప్పుల తీవ్రతకు భయపడి విద్యార్థులు ఒకేసారి బయటకు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే క్లాస్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ప్రాంతంలో ఏర్పడిన మంటలు స్కూల్ అంతటా వ్యాపించడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.

Also Read : అమెరికా ఎన్నికల్లో ఓటు వేసేందుకు యత్నం: భారతీయుడిపై కేసు

ఈ మంటలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాఠశాల భవనానికి బయటకు వెళ్లేందుకు ఒకే ఒక ఎగ్జిట్ ఉండటంతో అందరూ ఒకేసారి బయటకు రావడానికి ప్రయత్నించారు. దీంతో ద్వారం వద్ద తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. మంటల కంటే కూడా పొగ వల్ల ఊపిరాడక, తొక్కిసలాటలో కిందపడి కొందరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు. దట్టమైన పొగలు పాఠశాల భవనంతో పాటు సమీపంలోని దాదాపు 300 చెక్క ఇళ్లకు కూడా అంటున్నాయి. దీంతో ఆ ఇళ్లు మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు.

Also Read : పాకిస్తాన్ నకిలీ బాంబులు.. బంగ్లాదేశ్ ట్యాంక్ బ్లాస్ట్.. ఇద్దరు సైనికులు దుర్మరణం.. అసలేమైందంటే?

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.