
Telangana High Court : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కాగా, నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి రావడానికి ప్రయత్నించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని అరెస్ట్ చేయడంతో పోలీసుల తీరుపై బీఆర్‌ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో అసెంబ్లీ వద్ద జరిగిన సంఘటనలపై రాష్ట్ర హోంశాఖకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. .బీఆర్‌ఎస్ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ప్రభుత్వానికి, పోలీసు శాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా శాసనసభ, మండలిలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పోలీసులు అడ్డుకోవడానికి వీళ్లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రజాప్రతినిధులు తమ విధులకు హాజరవుతున్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకోవడం సరికాదని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ సభ్యులు సభలో, నిబంధనలు ఏమైనా ఉల్లంఘిస్తే, వారిపై చర్యలు తీసుకునే పూర్తి అధికారం కేవలం స్పీకర్‌కు మాత్రమే ఉందని తేల్చి చెప్పింది. పోలీసులే స్వయంగా శాసనసభ్యులపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి చట్టపరమైన అధికారం లేదని న్యాయస్థానం స్పష్టం తేల్చి చెప్పింది.
అలాగే అసెంబ్లీకి హాజరవుతున్న మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని తెలంగాణ హైకోర్టు అత్యంత తీవ్రంగా పరిగణించింది. మహిళా ప్రజాప్రతినిధులపై దాడి, దురుసు ప్రవర్తనకు పాల్పడిన పోలీసు సిబ్బందిని వెంటనే గుర్తించాలని ఆదేశించింది.. ‘‘మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత పోలీసులను గుర్తించాలి. ఈ ఘటనపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఈ అంశంలో డీజీపీ నివేదిక ఇవ్వాలి’’ అని హైకోర్టు ఆదేశించింది. దాడికి పాల్పడినట్లు రుజువైతే బాధ్యులైన ఆ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ సీవీ ఆనంద్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదికి ధర్మాసనం నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఇరువైపుల వాదనలను విన్న అనంతరం, ఈ కేసు విచారణను 2 వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.







