
Chennai : తమిళనాడు సీఎం విజయ్ గురువారం అసెంబ్లీలో కీలక ప్రకటనలు చేశారు. చెన్నైలో ప్రపంచ స్థాయి ఒలింపిక్ సిటీతో పాటు ప్రత్యేకంగా మోటార్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెన్నైలో ఫార్ములా-1 రేసులను నిర్వహించడమే లక్ష్యంగా ఈ మోటార్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఒలింపిక్ సిటీని నిర్మించనున్నారు. ఇందులో ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు, ఆధునిక క్రీడా పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఆటగాళ్లకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు హై-పెర్ఫార్మెన్స్ ట్రైనింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.
అలాగే ఆటగాళ్లకు అవసరమైన స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ కేంద్రాలు కూడా ఒలింపిక్ సిటీలో ఉంటాయి. క్రీడాకారులు, కోచ్‌ల కోసం వసతి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడు నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌తో పాటు అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించేందుకు ఈ ఒలింపిక్ సిటీ ఉపయోగపడుతుందని సీఎం విజయ్ తెలిపారు. ప్రపంచ స్థాయి శిక్షణ, వసతి సౌకర్యాలతో కూడిన క్రీడా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చెన్నైలో అంతర్జాతీయ క్రీడా పోటీలు నిర్వహించే అవకాశం కూడా పెరుగుతుందని చెప్పారు.
ఇక మోటార్ స్పోర్ట్స్ కోసం చెన్నైలో ప్రత్యేక సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో ఫార్ములా-1 నుంచి ఫార్ములా-4 వరకు రేసులను నిర్వహించేలా రేసింగ్ ట్రాక్‌లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. మోటార్ స్పోర్ట్స్‌పై ఆసక్తి ఉన్న యువతలో ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. రేసింగ్‌లో అవకాశాలు కల్పించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఛాంపియన్లుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం చెప్పారు.
మోటార్ స్పోర్ట్స్ సిటీ వల్ల క్రీడలతో పాటు పర్యాటకం, కార్ల తయారీకి సంబంధించిన పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి కూడా ఉపయోగం ఉంటుందని విజయ్ తెలిపారు. మరోవైపు దేశంలో ఫార్ములా-1 రేసులను తిరిగి తీసుకురావడానికి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ కూడా చర్యలు మొదలుపెట్టింది. ఈ ఏడాది జూన్‌లో మోటార్ స్పోర్ట్స్‌పై ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
2028 చివరి నాటికి భారత్‌లో మళ్లీ ఫార్ములా-1 రేసులు నిర్వహించే లక్ష్యంతో ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేస్తోంది. దేశంలోని మోటార్ స్పోర్ట్స్ పరిస్థితిని పరిశీలించి కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకు నివేదిక ఇవ్వనుంది. ఇలా ఒకవైపు కేంద్రం భారత్‌లో ఫార్ములా-1ను తిరిగి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు చెన్నైలో ప్రత్యేక మోటార్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో భవిష్యత్‌లో చెన్నైలో ఫార్ములా-1 రేసు జరిగే అవకాశాలపై ఆసక్తి పెరిగింది.









