India Helping Nepal  : ప్రకృతి విపత్తు మూలంగా అతలాకుతలమైన నేపాల్‌కు  భారత్‌ అందించిన సాయంపై ఆ దేశ ప్రధాని బాలెన్‌ షా కృతజ్ఞతలు తెలిపారు. వరదలు సంభవించిన మొదటి రోజే భారత్‌ స్పందించి సహాయ సామగ్రిని పంపిందని ఆయన పార్లమెంటులో కొనియాడారు. మందులు, ఆహార పదార్థాలు, నీటిని శుద్ధి చేసే పరికరాలతో పాటు నిపుణులైన సహాయక బృందాన్ని భారత్‌ నేపాల్‌ పంపిందని వెల్లడించారు. నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు పరిశీలకులను సైతం పంపిందని తెలిపారు.  భారత సాంకేతిక బృందాలు మారుమూల ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వివరించారు. సంక్షోభ సమయంలో భారత్‌  నిజమైన మిత్రదేశంగా.. అండగా నిలిచిందని ప్రధాని ప్రశంసించారు.

Also Read : రాలీ డెల్ పరాగ్వేలో మెరిసిన భారత జోడీ నవీన్ పులిగిళ్ల, మూసా షరీఫ్‌

కాగా విపత్తు అనంతరం భారత్‌ నేపాల్‌లో భారీ స్థాయిలో మానవతా, సాంకేతిక సహాయక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. రెస్క్యూ బృందాలు, వైద్య నిపుణులు, డీఎన్‌ఏ ఆధారిత గుర్తింపు కోసం ఫోరెన్సిక్‌ నిపుణులను పంపించింది. నేపాల్‌, చైనా అధికారులతో సమన్వయం కోసం విదేశాంగ శాఖలో 24 గంటల కంట్రోల్‌ రూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది.

కష్ట సుఖాల్లో భారత్‌ ఎపుడూ అండగా ఉంది…ఆరోగ్య మంత్రి నిషా మెహతా

నేపాల్‌ సుఖదుఃఖాల్లో భారత్ తమకు ఎల్లప్పుడూ అండగా ఉందని నేపాల్ ఆరోగ్య మంత్రి నిషా మెహతా స్పష్టం చేశారు. భారీ వరదలతో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్న తమ దేశానికి భారత్ మరోసారి ఆపద్బాంధవ పాత్ర పోషించిందని ఆమె వెల్లడించారు. వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన బాధితుల మృతదేహాలను వెలికితీయడం, వారిని గుర్తించడం, డీఎన్‌ఏ(DNA) పరీక్షలు నిర్వహించడం, ప్రత్యేక ల్యాబ్‌ల ఏర్పాటులో భారత్ అందిస్తున్న సహాయాన్ని నేపాల్ ఆరోగ్య శాఖ మంత్రి అభినందించారు.

భారత్, నేపాల్ దేశాల మధ్య సంబంధం ‘రోటీ-బేటీ’ వంటిదని ఆమె కొనియాడారు. ఇది కుటుంబ సదృశ్యమైన సోదరభావంతో కూడుకున్నదని నిషా మెహతా వెల్లడించారు. మంచి సమయాల్లోనే కాకుండా, కష్టకాలంలో కూడా భారత్ ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. వరదల నుంచి సురక్షితంగా రక్షించిన ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలలో ఉంచామని, వారికి తగిన వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. భారత్‌తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యూనిసెఫ్ (UNICEF) వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా క్షేత్రస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొంటున్నాయని ఆమె వివరించారు. కాగా, నేపాల్‌లో సంభవించిన ఘోర వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 1,127కు చేరుకున్నట్లు నేపాల్ పోలీసులు తెలిపారు.

Also Read : పాక్ కన్నింగ్ బుద్ధి.. మోదీ ఫొటోను తొలగించి.. ఏం చేశారంటే?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.