Bengaluru :  బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ మహిళ మాటలు నమ్మి మోసపోయాడు. షెల్లీ అనే మహిళతో కొన్ని రోజులుగా మాట్లాడిన అతడు.. ఆమెను కలవడానికి వెళ్లాడు. అయితే ఆమె చెప్పిన ఓ ప్యాకేజీ కోసం డబ్బులు చెల్లించిన తర్వాత అసలు విషయం తెలిసింది. షెల్లీతో పాటు మరో వ్యక్తి కూడా అతడిని బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని బాధితుడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. బెంగళూరు డేటింగ్ స్కామ్ అలెర్ట్ పేరుతో తనకు జరిగిన విషయం చెప్పాడు.

కొన్ని రోజుల క్రితం డేటింగ్ యాప్‌లో షెల్లీ పరిచయమైందని చెప్పాడు. ఇద్దరూ కొన్ని రోజులుగా మాట్లాడుకున్నామని, పని ఎక్కువగా ఉండటంతో ఆమెను కలవలేకపోయానని తెలిపాడు. చివరకు ఆఫీసులో ఖాళీ దొరకడంతో ఆమెను కలవాలని నిర్ణయించుకున్నాడు. అయితే కలవడానికి ముందే షెల్లీ ఓ పని చెప్పింది. రాన్ అనే వ్యక్తి దగ్గర ఓ ప్యాకేజీ ఉందని, దాన్ని తీసుకురావాలని కోరింది. దానికి ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించాలని, తాను తర్వాత నగదు ఇస్తానని చెప్పింది.

ఇది కాస్త వింతగా అనిపించినా.. ఆమె చెప్పిన మాటలు నమ్మానని బాధితుడు తెలిపాడు. తన తల్లికి వ్యాపారం ఉందని, తన దగ్గర ఆన్‌లైన్ డబ్బుల కంటే నగదే ఎక్కువగా ఉంటుందని షెల్లీ చెప్పిందని వివరించాడు. ఆ తర్వాత రాన్ చెప్పిన చోటుకు వెళ్లాడు. ప్యాకేజీ సిద్ధం చేస్తున్నానని రాన్ చెప్పాడు. ముందుగా డబ్బులు చెల్లించమన్నాడు. మొదట అనుమానం వచ్చినా చివరికి డబ్బులు ఇచ్చాడు. ఇదంతా జరుగుతున్న సమయంలో షెల్లీతో మాట్లాడుతూనే ఉన్నానని బాధితుడు చెప్పాడు. ఆ తర్వాత షెల్లీ మరోసారి సిగరెట్లు తీసుకురమ్మని అడిగింది. అవి తీసుకుని తిరిగి వచ్చేలోపే షెల్లీ, రాన్ ఇద్దరూ అతడిని బ్లాక్ చేశారు. దీంతో తాను మోసపోయానని అతడికి అర్థమైంది.

ఇద్దరూ కలిసి ముందే ప్లాన్ చేసి నన్ను మోసం చేశారు. నా దగ్గర డబ్బులు తీసుకుని ఇద్దరూ కనిపించకుండా పోయారని బాధితుడు చెప్పాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు అతడికి మద్దతు తెలిపారు. ఇలాంటి మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓ వ్యక్తి స్పందిస్తూ.. నిన్ను కొందరు ఎగతాళి చేస్తున్నారు. కానీ జరిగిన విషయాన్ని బయటకు చెప్పడం మంచిదే. కనీసం ఇంకొకరు మోసపోకుండా ఉంటే చాలు అని చెప్పాడు.

మరో వ్యక్తి.. మనకు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకపోవడం సహజమేనని, అందుకు బాధపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. మరో వ్యక్తి తాను కూడా నెల రోజుల క్రితం బంబుల్‌లో షెల్లీతో మాట్లాడినట్లు చెప్పాడు. ఆమె చాలా సాధారణంగానే అనిపించిందని, అయితే తాను బిజీగా ఉండటంతో మాట్లాడటం ఆపేశానని తెలిపాడు. ఇప్పుడు అలా మాట్లాడటం ఆపేయడం మంచిదే అనిపిస్తోందని చెప్పాడు. మరో యూజర్ బాధితుడికి సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించాడు. మోసపోయిన డబ్బును తిరిగి పొందేందుకు ప్రయత్నించవచ్చని, నిందితుల ఫోన్ నంబర్ వంటి వివరాలను కూడా పోలీసులకు ఇవ్వవచ్చని చెప్పాడు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.