
Iran : ఇరాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. రాత్రంతా ఇరాన్‌లోని పలు ప్రాంతాలను అమెరికా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఇటీవల హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాడులకు ప్రయత్నించింది. ఈ దాడుల్లో ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతమైన సిరిక్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సిరిక్ ప్రాంతంలోని కుహెస్తక్ నగరంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుక జరుగుతుండగా అమెరికా క్షిపణి దాడికి సంబంధించిన శకలాలు ఆ ఇంటిని తాకాయి. ఈ ఘటనలో ఓ చిన్నారి సహా కనీసం నలుగురు మృతి చెందగా, మరో 50 మంది వరకు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
అయితే తాము పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. అమెరికా సైన్యం పౌరులను ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోదని, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని CENTCOM ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ తెలిపారు. ఇరాన్ కూడా అమెరికాపై ప్రతీకార దాడులకు దిగింది. బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లోని అమెరికా ప్రయోజనాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అమెరికా దళాలకు వ్యతిరేకంగా మరింత తీవ్రమైన చర్యలు ఉంటాయని ఇరాన్ ముందే హెచ్చరించింది.
ప్రత్యక్షంగా అమెరికా దాడులు మళ్లీ ప్రారంభమైన తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తొలిసారి స్పందించారు. వాషింగ్టన్కు తమ సాయుధ దళాలు ఎప్పటికీ మర్చిపోలేని పాఠాలు నేర్పుతాయని ఆయన హెచ్చరించారు. ఐఆర్జీసీ అధికార ప్రతినిధి హొస్సేన్ మొహెబీ కూడా అమెరికాను హెచ్చరించారు. అమెరికా చేపట్టిన తాజా దాడులకు ఆ దేశం పశ్చాత్తాపపడాల్సి వస్తుందని, దాడులకు పాల్పడిన వారికి తీవ్రమైన శిక్ష తప్పదని ఎక్స్‌లో పోస్టు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్‌పై పెద్ద ఎత్తున, శక్తివంతమైన దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. హార్ముజ్ జలసంధిలో సముద్రపు మైన్లు పెట్టేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నం విఫలమైందని, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ ఎనిమిది క్షిపణులు ప్రయోగించిందని, వాటన్నింటినీ అడ్డుకున్నామని చెప్పారు. ఈ చర్యలకు ప్రతీకారంగానే తాజా దాడులు చేస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు అమెరికా బలగాలపై తమ దాడులు కొనసాగుతాయని ఇరాన్ ప్రకటించింది. అమెరికా చేసిన చర్యలకు వారు పశ్చాత్తాపపడే వరకు దాడులు ఆగవని ఇరాన్ ఖాతమ్ అల్-అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ అధికార ప్రతినిధి కల్నల్ ఇబ్రహీం జోల్ఫఘారి తెలిపారు. అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశామని, వాటి వల్ల మౌలిక వసతులు, సదుపాయాలు, ఆయుధాలు, ఇతర పరికరాలకు భారీ నష్టం జరిగిందని ఆయన పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో అమెరికా కమాండర్లు, సైనికులు మరణించారని లేదా గాయపడ్డారని ఆయన ఆరోపించారు.









