
Bihar : నేపాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా గండక్ నదిలోకి, దాని పరివాహక ప్రాంతాల్లోకి గుర్తు తెలియని, సాధారణంగా కనిపించని చేపలు కొట్టుకొచ్చాయి. దీంతో బిహార్ ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేసింది. పశ్చిమ చంపారన్, గోపాల్గంజ్ జిల్లాల ప్రజలు ఈ చేపలను తినొద్దని, కొనొద్దని, అమ్మొద్దని సూచించింది. ఈ చేపలు ఏ జాతికి చెందినవో, తినడానికి సురక్షితమైనవో కాదో అధికారులు నిర్ధారించే వరకు వాటికి దూరంగా ఉండాలని హెచ్చరించింది.
నేపాల్ నుంచి వచ్చిన వరద నీరు గండక్ నదీ వ్యవస్థలోకి చేరడంతో పశ్చిమ చంపారన్, గోపాల్గంజ్ జిల్లాల్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరదల సమయంలో చెరువులు, నదులు, ఇతర నీటి వనరుల్లోని చేపలు నీటితో పాటు కొట్టుకుపోయి చాలా దూరం వెళ్లే అవకాశం ఉందని బిహార్ డెయిరీ, ఫిషరీస్ అండ్ యానిమల్ రిసోర్సెస్ శాఖకు చెందిన మత్స్య విభాగం తెలిపింది.
వరద నీటితో కొట్టుకెళ్లే సమయంలో చేపలు కలుషితమైన డ్రైనేజీ నీరు, చనిపోయిన జంతువులు, ఇతర మురికి పదార్థాలను తాకే అవకాశం ఉంటుంది. దీంతో వాటిపై బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు చేరే ప్రమాదం ఉందని అధికారులు చెప్పారు. అందుకే వరద నీటిలో దొరికే గుర్తు తెలియని లేదా వింతగా కనిపించే చేపలను తినకూడదని స్పష్టం చేశారు.
గుర్తు తెలియని చేపలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయొద్దని, అమ్మొద్దని కూడా ప్రజలను ప్రభుత్వం కోరింది. సాధారణంగా తినే చేపలా కనిపిస్తోందని మాత్రమే అది సురక్షితమైనదని భావించకూడదని సూచించింది. సంబంధిత అధికారులు ఆ చేప ఏ జాతికి చెందినదో, తినడానికి సురక్షితమైనదో నిర్ధారించే వరకు దానిని ఆహారంగా ఉపయోగించకూడదని అడ్వైజరీలో పేర్కొంది. ఇలాంటి చేపలను తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, తల తిరగడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది.









