
Nurse Murder Case : రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రైమ్ కేర్ దవాఖాన షెల్టర్ రూమ్‌లో హత్యకు గురైన నర్సు శిరీష కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఓ కిరాతకుడు అత్యంత పాశవికంగా ఆమెను చంపేశాడు. హాస్పిటల్పక్కన ఉన్న షెల్టర్ రూమ్‌లో స్నేహితురాలితో కలిసి ఉంటున్న నర్సు అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న సమయం చూసి నిందితుడు రూమ్‌లోకి ప్రవేశించాడు. ఆమె ప్రతిఘటించడంతో రాడ్‌తో ముఖంపై చితకబాదాడు. ఆ తర్వాత లైంగికదాడి చేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరగ్గా.. పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన శిరీష (21) ఏడు నెలలుగా తుక్కుగూడలో ఉన్న ప్రైమ్ కేర్ దవాఖానలో నర్సుగా పని చేస్తోంది. ఆ హాస్పిటల్బిల్డింగ్ కింది గదిలోనే ఓ బైక్మెకానిక్షాపు ఉంది. ఆ షాపు పక్క సందు నుంచే నర్సులకు కేటాయించిన రూమ్‌లకు వెళ్లాలి. అయితే, శనివారం మధ్యాహ్నం శిరీష డ్యూటీకి రాకపోవడంతో తోటి సిబ్బంది గదికి వెళ్లి ఆమెను పిలిచారు. ఆమె పలకకపోవడంతో తలుపులు కొట్టారు. అయినా లోపల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కిటికీలోంచి చూడగా ముఖంపై తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో శిరీష అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు.
Also Read : భార్యను చంపి, గుండెపోటని నమ్మించే ప్రయత్నం.. గుట్టు రట్టు చేసిన సీసీటీవీ కెమెరా
వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. సమచారం అందుకున్న పహడీషరీఫ్పోలీసులు డాగ్, క్లూస్ టీమ్‌తో వచ్చి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. కాగా, శిరీష ముఖంపై పంక్చర్ లివర్‌తో బలంగా కొట్టి హతమార్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.అలాగే కాళ్లపై కూడా తీవ్ర గాయాలుండడాన్ని గమనించారు. బాధితురాలి దుస్తులు, శరీరంపై ఉన్న గాయాలను బట్టి లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.
కిటికీ గుండా లోపలికి ప్రవేశించి..
కాగా, హత్యకు కారణం హాస్పిటల్ కింద ఉన్న మెకానిక్ షాపులో పనిచేసే మెకానిక్ అని పోలీసులు గుర్తించారు. నిందితుడు బిహార్‌లోని బేగుసరాయ్ జిల్లా బచ్వారా మండలం రుదౌలి గ్రామానికి చెందిన మహ్మద్ సనావుల్లా(34)గా తేల్చారు. అతను తుక్కుగూడ వద్ద ప్రైమ్ కేర్ హాస్పిటల్ కింద ఆవరణలో ఉన్న షాపులో బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నట్లు తెలిపారు. నర్సుల హాస్టల్పక్కనే షాపు ఉండడంతో కొద్ది రోజులుగా ఆ గదిలో ఉంటున్న నర్సులు వచ్చే టైం, వెళ్లే టైం గమనిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి ఆమె తన రూమ్‌లో ఒంటరిగా ఉందని, పక్కన రూముల్లో కూడా ఎవరూ లేరని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత ఆ గది కిటికీ తొలగించి దాని ద్వారా ఆమె రూమ్‌లోకి ప్రవేశించాడు.
కిటికీ వద్ద అలికిడి విన్న నర్సు కళ్లు తెరిచి చూసే సరికి ఎవరో లోపలకు వస్తున్నట్లు కనిపించింది. దీంతో అరవబోయింది. వెంటనే ఆమె నోరు మూసిన నిందితుడు ఆపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. రెచ్చిపోయిన నిందితుడు రాడ్‌తో ఆమె ముఖంపై చితకబాదాడు. దీంతో శిరీష స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమెపై లైంగికదాడి చేసిన సదావుల్లా తర్వాత గొంతు నులిమి చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు.
తల్లితో మాట్లాడిన గంటలోనే..
కాగా, నర్సు శిరీష తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ ఆమెతో పాటు మరో కొడుకును పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు రాత్రి 10.30 గంటల వరకు కుటుంబసభ్యులతో అమె వీడియో కాల్‌లో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాను బాగానే ఉన్నానని, తల్లి, తమ్ముడు ఎలా ఉన్నారని ఆమె వారి యోగక్షేమాలు తెలుసుకుంది. శనివారం తనకు మధ్యాహ్నం డ్యూటీ ఉందని కూడా చెప్పింది. ఆ తర్వాత నిద్ర వస్తోందని చెప్పి పడుకుంటానని ఫోన్పెట్టేసింది. ఆమె పడుకున్న కొద్ది గంటల్లోనే నిందితుడు ఆమె రూమ్‌లోకి ప్రవేశించి లైంగికదాడి చేసి ప్రాణాలు తీసినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : తినేది ఇండియా తిండి..పాడేది పాకిస్థాన్ పాట.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్!
బోరున విలపించిన తల్లి
కాగా, కూతురి మరణవార్త తెలుసుకున్న తల్లి ఉస్మానియా మార్చురీ దగ్గరకు వచ్చింది. తన కూతురి డెడ్‌బాడీని చూసి భోరున విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. ‘‘ఎక్కడో మూరుమూల గ్రామం నుంచి ఉద్యోగం కోసం వచ్చిన నా బిడ్డను ఇంత దారుణంగా చంపిన వాడిని వదలొద్దు సార్.. చంపెయ్యండి సార్.. నా బిడ్డ ఎంత నరకయాతన అనుభవించిందో వాడు కూడా అంతే నరకయాతన అనుభవించాలి’’ అంటూ రోదించిన తీరు కలిచివేసింది. రూమ్‌లో ఉన్నా కూడా వచ్చి చంపేస్తే ఇక రక్షణ ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించింది. కాగా, ఉస్మానియాలో పోస్టుమార్టం ముగిసిన అనంతరం శిరీష మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
అనుమానస్పద కదలికలతో..
కాగా, నిందితుడు శిరీషను చంపిన తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి పెట్రోల్ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అనుకోకుండా ఒక సంఘటన జరిగినట్లు అతనికి చెప్పినట్లు విచారణలో వెల్లడైంది. ఒకవేళ పెట్రోల్ దొరికితే శిరీష శరీరాన్ని ఆనవాళ్లు దొరకకుండా దహనం చేయాలనుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, హత్య జరిగిన సమయంలో నిందితుడు సదావుల్లా మొబైల్ సిగ్నల్స్, దవాఖాన క్వార్టర్స్ పరిసరాల్లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హాస్పిటల్పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ తో పాటు, తుక్కుగూడ జంక్షన్ సమీపంలోని సీసీటీవీ కెమెరాలను వారు తనిఖీ చేశారు. నిందితుడు ఉంటున్న ఇల్లు కూడా దవాఖాన సమీపంలోనే ఉండడంతో ఘటన జరిగిన టైంలో అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు కెమెరా విజువల్స్ ద్వారా నిర్ధారించుకున్నారు. ఘటనాస్థలంనుంచి సేకరించిన వేలిముద్రలు, ఇతర ఆధారాలు కూడా నిందితుడికి సరిపోలడంతో పోలీసులు అతడే హంతకుడని ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా, సదావుల్లాకు పెళ్లి కాగా భార్య, పిల్లలు బిహార్‌లోనే ఉంటున్నారని తెలిసింది.









