PM Modi :  ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం లభించింది. తాష్కెంట్‌లో జరిగిన కార్యక్రమంలో ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్.. మోదీకి ఆర్డర్ ఆఫ్ ఒలియ్ దరజాలి దోస్త్‌లిక్ అవార్డును అందించారు. ఇది మోదీకి లభించిన 36వ అంతర్జాతీయ పురస్కారం.

ఉజ్బెకిస్థాన్ అత్యున్నత అవార్డు అందుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందని మోదీ అన్నారు. ఈ గౌరవాన్ని తనకు మాత్రమే దక్కినదిగా కాకుండా భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య ఉన్న స్నేహానికి గుర్తుగా భావిస్తున్నట్లు చెప్పారు.

దోస్త్‌లిక్ అంటే స్నేహం అని మోదీ వివరించారు. దోస్త్ అనే పదం భారతీయులకు కూడా బాగా పరిచయమేనని చెప్పారు. భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య ఉన్న సంబంధానికి దోస్త్‌లిక్ అనే పదం సరిగ్గా సరిపోతుందని అన్నారు.

ఈ అవార్డు తన ఒక్కరికే కాదని.. 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని మోదీ చెప్పారు. భారతీయుల తరఫున ఉజ్బెకిస్థాన్ ప్రజలకు, ఆ దేశ ప్రభుత్వానికి, తన మిత్రుడు అధ్యక్షుడు మిర్జియోయెవ్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఇరు దేశాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో అధ్యక్షుడు మిర్జియోయెవ్.. మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రశంసించారు. అన్ని రంగాల్లో భారత్ మంచి ఫలితాలు సాధిస్తోందని, ఆర్థిక వృద్ధి కూడా వేగంగా కొనసాగుతోందని చెప్పారు. దేశంలో ఎన్నో పెద్ద ప్రాజెక్టులు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య దీర్ఘకాలికంగా యురేనియం సరఫరా జరిగేలా ఒప్పందం చేసుకోనున్నట్లు మోదీ తెలిపారు. అలాగే ఇరు దేశాల్లోని కొన్ని నగరాలు, రాష్ట్రాల మధ్య సిస్టర్ సిటీ, సిస్టర్ స్టేట్ సంబంధాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సంబంధాల ద్వారా మరింత ప్రయోజనం పొందేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.