
-RAVI PRAKASH
Nepal floods : ఇటీవలి నేపాల్ వరదల్లో లోయలోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన నీటి ప్రవాహం వెనుక ఉన్న భయంకరమైన ప్రమాదం అర్థమవుతుంది. ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చిన బండరాళ్లు, మంచు, మట్టి వల్ల అక్కడ ఉన్న ప్రజలకు తప్పించుకోవడానికి సమయమే లేకుండాపోయింది. అయితే ఆరోజు నేపాల్లో అసలు ఏం జరిగిందనేది ప్రధాన ప్రశ్న. ఇది కేవలం దట్టమైన మేఘాల వల్ల వచ్చిన క్లౌడ్ బర్స్ట్ ముప్పా? లేక భూకంపం వల్ల ఏమైనా జరిగిందా? మంచు నది (గ్లేసియర్) కరిగి ఈ ప్రమాదం సంభవించిందా? లేక మన కంటికి కనిపించని చోట, హిమాలయాల్లో అత్యంత ఎత్తులో మరేదైనా పెద్ద విపత్తు జరిగిందా? ఈ ఘటనపై శాస్త్రవేత్తల పరిశీలన మొదలయ్యాక విషయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇది ఒకే ప్రమాదం కాకపోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి జరిగిన చైన్ రియాక్షన్ కావచ్చు. సముద్ర మట్టానికి దాదాపు 5,200 మీటర్ల ఎత్తులో ఉన్న లాంగ్టాంగ్ పర్వత శ్రేణిలోని లాంగ్టాంగ్ లిరుంగ్కు ఉత్తర వైపున ఈ విపత్తుకు పునాది పడింది. ప్రమాదానికి ముందు, తర్వాత తీసిన ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఒక షాకింగ్ విషయం కనిపిస్తోంది. పర్వతంపై ఉన్న భారీ మంచుకొండ, కింద ఉన్న పర్వత భాగం ఒక్కసారిగా విరిగి కిందికి జారిపోయినట్లు కనిపిస్తోంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం విడిపోయిన ఆ భాగం దాదాపు 1 నుంచి 1.3 కిలోమీటర్ల వెడల్పు ఉండొచ్చు. అత్యంత నిటారుగా ఉన్న పర్వత వాలుపై నుంచి అది భారీ వేగంతో కిందికి దూసుకొచ్చింది.
ఒక్కసారిగా మంచుకొండ, భారీ రాళ్లు కూలిపోవడం ఒక తీవ్రమైన హిమపాతానికి దారితీసింది. ఆ భారీ మంచు కొండ, రాళ్లు ల్హెండే ఖోలా నదీలోకి చేరి నదీ ప్రవాహాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నాయి. ఒక డ్యామ్లాగా ఏర్పడ్డాయి. ఆ న్యాచురల్ డ్యామ్ వెనుక నీరు భారీగా పేరుకుపోవడంతో దిగువ ప్రాంతాల్లో కేవలం 30 నిమిషాల్లోనే నీటిమట్టం 9 మీటర్ల వరకు పెరిగింది. అసలు నేపాల్లో జరిగింది – గ్లేసియల్ లేక్ అవుట్ బర్స్ట్(గ్లోఫ్) వల్ల వచ్చిన వరదా? ప్రస్తుత సమాచారం ప్రకారం దీనిని క్లాసిక్ గ్లోఫ్ అని చెప్పలేం. ఎందుకంటే సాధారణంగా గ్లోఫ్ అంటే మంచు కరిగి ఏర్పడిన సరస్సుకు అడ్డుగా ఉన్న మంచు-రాళ్ల అడ్డుకట్ట తెగిపోయి నీరు విడుదల కావడం. కానీ ఇక్కడ ప్రమాదం మొదలైన ప్రాంతంలో అంతకుముందే సరస్సు ఉన్నట్లు ఆధారాలు లేవు. పర్వతం కూలి, ఏర్పడిన శిథిలాలు నదిని అడ్డుకోవడం వల్ల కొత్తగా నీటి నిల్వలు ఏర్పడ్డాయి. అంటే ఇది ఒకదాని తర్వాత ఒకటి జరిగిన సమిష్టి/గొలుసుకట్టు విపత్తు.
మంచుకొండలు, రాళ్ల వెనుక ఏర్పడిన కొత్త సరస్సులను ఇప్పుడు శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు. ఆ అడ్డుకట్టలు పూర్తిగా, సురక్షితంగా తొలగిపోయే వరకు వరద ముప్పు ఇంకా ఉందనేది నేపాల్ అధికారుల హెచ్చరిక. ఈ ఘటనలో వాతావరణ మార్పుల పాత్ర ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ హిమాలయాలు వేడెక్కుతున్నాయని, అలాగే పర్వతాలను బలంగా పట్టి ఉంచే మంచుతో గడ్డకట్టిన నేల అయిన హిమభూమి స్థిరత్వాన్ని కోల్పోతోందని మనకు తెలుసు. మన దగ్గర ఉన్న చాలా ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు కేవలం వర్షాలు లేదా తెలిసిన సరస్సులను మాత్రమే పర్యవేక్షించగలవు. కానీ ఇలాంటి వేగవంతమైన విపత్తు క్రమాలు (ర్యాపిడ్ హజార్డ్ కాస్కేడ్స్) సంప్రదాయ వ్యవస్థల కంటే అత్యంత వేగంగా జరిగిపోతాయి. ఈ ఘటన మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఏమిటంటే..మనం కేవలం భూకంపాలు, క్లౌడ్ బర్స్ట్స్ లేదా గ్లోఫ్ల కోసం మాత్రమే సిద్ధంగా ఉంటే సరిపోదు. ఒక ప్రమాదం మరో ప్రమాదానికి కారణమయ్యే పరిస్థితులకు కూడా సిద్ధంగా ఉండాలి. హిమాలయాలు ఆసియాలోని ఎన్నో ముఖ్యమైన నదులకు మూలం . అందుకే నేపాల్లో జరిగింది కేవలం ఆ దేశ కథ మాత్రమే కాదు, భారతదేశంతో సహా మొత్తం హిమాలయ ప్రాంతానికి ఒక పెద్ద హెచ్చరిక.









