Crime News :భార్యభర్తల మధ్యజరిగే చిన్నచిన్న గొడవల్లో క్షణికావేశానికి గురై ఒకరిని ఒకరు చంపుకునే దారుణమైన ఘటనలకు దారి తీస్తోంది. ఆవేశంగా చేసిన పనిని కప్పిపుచ్చుకునే క్రమంలో చట్టానికి దొరికి కటకటాల పాలవుతున్నారు. తాజాగా కుటుంబ కలహాల మూలంగా ఓ వ్యక్తి తన భార్యను ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఏం చేయాలో తెలియక తన భార్య గుండెపోటు కారణంగా చనిపోయిందనీ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, పోలీసులు ఎంక్వయిరీ చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. సీసీటీవీ కెమెరా ఫుటేజీలతో భర్త దుర్మార్గం బయటపడింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ర్టంలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

కర్ణాటకలోని మంకి గ్రామానికి చెందిన గణపతి, మంగళ భార్యభర్తలు. అయితే మంగళ (27) కు, ఆమె భర్త గణపతి మంజునాథ్ నాయక్‌కు మధ్య గత కొంత కాలంగా తరచూ చిన్నచిన్న విషయాలపై గొడవలు జరుగుతున్నాయి. కాగా, గణపతి మద్యానికి బానిసై ఇష్టం వచ్చినట్లు డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 25వ తేదీ అర్ధరాత్రి కూడా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. గొడవ నేపథ్యంలో గణపతి భార్యపై కోపంతో ఊడి పోయాడు. ఆ కోపంలో ఆమెను చంపడానికి నిశ్చయించుకున్నాడు. రాత్రి 2 గంటల సమయంలో గదిలో నిద్రిస్తున్న మంగళపై తీవ్ర స్థాయిలో దాడి చేశాడు. ఆమె నోరు, ముక్కు గట్టిగా నొక్కిపెట్టి మెడ పిసికి హత్య చేశాడు. అలా ఆమె నిద్రలోనే కన్ను మూసింది. ఈ కేసు తన మీదకు అనురాకుండా ఉండేందుకు గుండెపోటని నాటకానికి తెర తీశాడు.

మంగళకు రాత్రి పూట హఠాత్తుగా గుండెపోటు వచ్చిందని నిద్రలోనే చనిపోయిందని ఇంట్లోని తన తల్లిదండ్రులను నమ్మించాడు. ఆ తర్వాత మంగళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మంగళకు రాత్రిగుండె పోటు వచ్చిందని, ఆ తర్వాత మంగళను తన ఆటో రిక్షాలో ఆసుపత్రికి తరలించానని తెలిపారు. మార్గమధ్యంలోనే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో తిరిగి ఆమెను ఇంటికి తీసుకువచ్చానని నమ్మించాడు. అయితే, గణపతి మాటలపై అనుమానం వచ్చిన మంగళ సోదరి మంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన ఇంటి పక్కన ఉన్న భవనంలోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను సునీతంగా పరిశీలించారు. ఈ క్రమంలో నిందితుడు గణపతి ఆ రాత్రి అసలు ఆటోను ఇంటి నుంచి బయటకు తీయలేదని అందులో తేలింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, తనే భార్యను హత్య చేసినట్లు అంగీకరించడంతో అతన్ని అరెస్ట్‌ చేశారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.