ICIMOD : నేపాల్‌లో ఇటీవల సంభవించిన భారీ ఆకస్మిక వరదల్లో 272 మంది ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర విషదాన్ని నింపింది. అయితే ఈ ఘోర విపత్తు జరగడానికి సరిగ్గా ఐదు నెలల ముందే.. హిందూ కుశ్ హిమాలయ ప్రాంతంలోని మంచు నదులు కరిగిపోతున్న తీరుపై రెండు కీలక నివేదికలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి.

కాఠ్‌మాండూ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెన్ డెవలప్‌మెంట్ (ICIMOD) సంస్థ మార్చిలో ఈ నివేదికలను విడుదల చేసింది. భారత్, నేపాల్, భూటాన్, చైనా వంటి దేశాలు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ.. హిమాలయాల్లో మంచు వేగంగా కరిగిపోతోందని, 2000 సంవత్సరం తర్వాత మంచు కరిగే వేగం రెట్టింపు అయిందని ఆందోళన వ్యక్తం చేసింది. 1975 నుంచి ఇప్పటివరకు దాదాపు 27 మీటర్ల మందమైన హిమానీనదం కరిగిపోయిందని ఆ నివేదికలు స్పష్టం చేశాయి.

నేపాల్ వరదలకు గల అసలు కారణాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. అయితే, 4,000 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉండే ప్రాంతాల్లో మంచు కురవడానికి బదులుగా వర్షాలు కురవడమే ఈ విపత్తుకు ప్రధాన కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. డెహ్రాడూన్‌లోని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ శాస్త్రవేత్త తెలిపిన వివరాల ప్రకారం.. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్లే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎత్తు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి, దీనివల్ల గ్లేసియర్లు వేగంగా కరిగిపోతున్నాయి.

మరోవైపు, 1990 నుంచి 2020 మధ్య కాలంలో HKH ప్రాంతంలోని గ్లేసియర్లు తమ మొత్తం విస్తీర్ణంలో సుమారు 12 శాతాన్ని, అంచనా వేసిన మంచు నిల్వల్లో 9 శాతాన్ని కోల్పోయినట్లు ICIMOD తెలిపింది. HKH గ్లేసియర్ అవుట్‌లుక్ 2026 నివేదిక ప్రకారం.. మంచు ప్రాంతాలు కోలుకోలేని స్థితికి చేరుకుంటున్నాయని హెచ్చరించింది.

ఐఐటీ ఇండోర్ అసోసియేట్ ప్రొఫెసర్, ICIMOD సీనియర్ క్రియోస్పియర్ స్పెషలిస్ట్ మొహమ్మద్ ఫరూక్ అజమ్ మాట్లాడుతూ.. మంచు గొడుగులు తగ్గిపోవడం, గ్లేసియర్లు వెనక్కి తగ్గుతుండటం, బంజరు ప్రాంతాలు పెరిగిపోవడం వల్ల అవి ఎక్కువ వేడిని పీల్చుకుని వాలులను మరింత బలహీనపరుస్తున్నాయని తెలిపారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.