Gig workers : దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ సేవలు, డెలివరీలపై ఆధారపడే కోట్లాది మంది వినియోగదారులకు ఇది మింగుడు పడనివార్త. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1.2 కోట్ల మంది గిగ్‌వర్కర్లు (Gig workers) నేడు ఒక భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 చొప్పున పెరగడం, దానికి అనుగుణంగా తమ వేతనాలు పెరగకపోవడాన్ని నిరసిస్తూ వారు ఇవాళ సమ్మెకు దిగుతున్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను లీటరుకు రూ. 3 చొప్పున పెంచిన నేపథ్యంలో, రోజువారీ రవాణా ఖర్చులతో సతమతమవుతున్న గిగ్‌వర్కర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) ఆధ్వర్యంలో నేడు (శనివారం) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 12:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు (మొత్తం 5 గంటల పాటు) గిగ్‌వర్కర్లు తమ విధులను బహిష్కరించనున్నారు. స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), బ్లింకిట్ (Blinkit), జెప్టో (Zepto) వంటి ప్రముఖ డెలివరీ సంస్థల డెలివరీ భాగస్వాములతో పాటు వివిధ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన క్యాబ్ డ్రైవర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. నిరసనలో భాగంగా కార్మికులంతా తమ మొబైల్ యాప్‌లను ‘ఆఫ్‌లైన్’ లో ఉంచనున్నారు.
రోజువారీ ఆదాయం కోసం మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై ఆధారపడే తమకు ఇంధన ధరల పెంపు తీవ్ర నష్టాన్ని మిగులుస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రభుత్వం,ఆయా సంస్థల ముందు కొన్ని డిమాండ్లను ఉంచారు. పెరుగుతున్న ఇంధన, వాహన నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా కనీస డెలివరీ రేటును కిలోమీటర్‌కు రూ.20 వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.పెరిగిన పెట్రోల్ ధరల భారాన్ని తగ్గించేందుకు కంపెనీలు ప్రత్యేకంగా ఇంధన నష్టపరిహారాన్ని (Fuel Allowance) చెల్లించాలి.
గిగ్‌వర్కర్లకు శాశ్వత సామాజిక భద్రత, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పించాలి. (గతంలో జరిగిన నిరసనల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతపై ముసాయిదా నిబంధనలను విడుదల చేసినప్పటికీ, అవి ఇంకా పూర్తిగా అమలు కాకపోవడంపై వారు ఆందోళన చెందుతున్నారు). “ఒకవేళ మా ఇంధన ఖర్చులకు అనుగుణంగా కంపెనీలు రేట్లు పెంచకపోతే, ఆర్థికంగా మనుగడ సాగించలేక మేము ఈ రంగాన్ని పూర్తిగా విడిచిపెట్టాల్సి వస్తుంది” అని యూనియన్ ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి, ఆన్‌లైన్ సంస్థలకు వినతిపత్రాలు సమర్పించారు.
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు గిగ్‌వర్కర్లు అందుబాటులో ఉండకపోవడం వల్ల ఆన్‌లైన్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. లంచ్ టైమ్ (మధ్యాహ్న భోజన సమయం) లో స్విగ్గీ, జొమాటోల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే వారికి తీవ్ర అసౌకర్యం కలగనుంది. అలాగే బ్లింకిట్, జెప్టో ద్వారా 10 నిమిషాల్లో వచ్చే నిత్యావసర వస్తువుల (Groceries) సేవలకు అంతరాయం కలగవచ్చు.శనివారం వీకెండ్ కావడంతో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. క్యాబ్ డ్రైవర్లు కూడా ఈ సమ్మెకు మద్దతు ఇస్తుండటంతో ఓలా, ఉబెర్ వంటి సేవల లభ్యత తగ్గి, ధరలు (Surge Pricing) పెరిగే అవకాశం ఉంది.
తమ సమస్యలను, ఆర్థిక ఒత్తిడిని ప్రభుత్వం. కార్పొరేట్ సంస్థల దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ ఐదు గంటల శాంతియుత సమ్మెను చేపడుతున్నట్లు గిగ్ వర్కర్ల యూనియన్ స్పష్టం చేసింది. మరి ఈ నిరసనపై అటు ప్రభుత్వం, ఇటు ప్రముఖ డెలివరీ సంస్థలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.







