BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షాకింగ్ అప్‌డేట్ వచ్చింది.  ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ ఎన్నికల్లో15 పోలింగ్‌ కేంద్రాల్లో జరిగిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. దక్షిణ 24 పరగణాల జిల్లాలో అక్రమాలు జరిగాయంటూ ఈసీకి పలువురు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లోని రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్న 15 పోలింగ్‌ కేంద్రాల ఎన్నికలను రద్దు చేసింది. మే 2వ తేదిన రీపోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించింది.  

శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. రీపోలింగ్ జరిగే ఈ 15 పోలింగ్ కేంద్రాల్లో.. మగ్రాహత్ పశ్చిమ నియోజకవర్గంలో 11 బూత్‌లు, డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో 4 బూత్‌లు ఉన్నాయి. ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో రిగ్గింగ్, ఈవీఎం ట్యాంపరింగ్ లాంటి అక్రమాలు జరిగినట్లు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుంచి వచ్చిన రిపోర్టుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది.

 ముఖ్యంగా డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో అక్కడ జరిగిన ఈ అవకతవకలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీజేపీ చేస్తున్న ఆరోపణలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఈసీ తన ప్రత్యేక పరిశీలకుడు సుబ్రత గుప్తను సైతం బరిలోకి దింపింది. ఆయన సమర్పించిన రిపోర్టులోని ఆధారాల ద్వారే రీపోలింగ్ అనివార్యమైనట్లు అధికారులు తెలిపారు. మే 4న ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసేలా అధికారులు కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.